Weather Updates: వేగంగా విస్తరిస్తున్న ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావం సైతం - IMD ఎల్లో వార్నింగ్
అల్పపీడనం ప్రభావం, ఈశాన్య రుతుపవనాల రాకతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rains in Telangana AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. 2015 లో నెల్లూరు జిల్లాలో నవంబర్ నెలలో ఒకే రోజులో 200 - 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈసారి అటు ఇటూ అలాంటి వర్షాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు, తిరుపతి జిల్లా ప్రజలను హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేటి నాలుగు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో అల్పపీడనం ప్రభావం చూపనుంది. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్ష తీవ్రత కోస్తాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉంటుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండటంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో నవంబర్ 1 నుంచి నాలుగు రోజులపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనంతో పాటు వస్తున్న ఉపరితల ఆవర్తనం కాస్త ఆలస్యంగా రావడం వలన రాత్రివేళ అధికంగా కురవనున్నాయి. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో తేలికపాటి వర్షాలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలున్నాయి. నవంబర్ 2, నవంబర్ 3న వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తక్కువ వర్షాలున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3 తేదీలలో చలి గాలులు వీచనున్నాయి. తెలంగాణ - ఆంధ్ర సరిహద్దు భాగాల్లో మాత్రం నవంబర్ 2, 3 తేదీల్లో చినుకులు ఉండే అవకాశాలున్నాయి.
Impact based forecast of Andhra Pradesh dated 31.10.2022 pic.twitter.com/p0clp0cXFB
— MC Amaravati (@AmaravatiMc) October 31, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. ఏడేళ్ల తరువాత ఆ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. కోస్తా ప్రాంతాలకి ఆనుకొని ఉండే భాగాలు ముఖ్యంగా నెల్లూరు, సూళూరుపేట, కృష్ణపట్నం, చెన్నైకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 3, 4 తేదీలలో సాధారణ వర్షాలున్నాయి.
ప్రకాశం, అన్నమయ్య జిల్లా, కడప, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాల్లో, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. చిట్వేల్, ఒంగోలు, కందుకూరు, బద్వేల్, మచిలీపట్నం, అమలాపురం, నర్సాపురం లాంటి ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం ఉంటుంది. నవంబర్ 1 నుంచి నవంబర్ 4 వరకు వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 31, 2022
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో రాత్రిపూట చలి తీవ్రత పెరుగుతోంది. అల్పపీడనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నవంబర్ తొలి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ లో ఆకాశాన్ని పాక్షికంగా మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.