Weather Latest Update: పగటివేళ ఠారెత్తుతున్న ఎండలు, రాత్రివేళ కొన్ని ప్రాంతాల్లో మంచు!
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
వాతావరణ శాఖ మరో రెండు నెలల వేసవి సూచనను విడుదల చేసింది. ఆ ప్రకారం, ఈశాన్య, తూర్పు, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మార్చి నుండి మే వరకు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలకు గురయ్యే అవకాశం ఉంది.
ఇక తెలంగాణలో క్రమంగా చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి పూట చలి నేడు అన్ని జిల్లాల్లో సాధారణంగానే ఉండనుంది. నిన్న మొన్నటి వరకూ కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతల విషయంలో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ లేదా ఆరెంజ్ అలర్ట్ ఉండేది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.1 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ‘‘ఎల్-నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న మూడు నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువ ఉండనుంది. పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు బాగా బలహీనపడింది. దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. మార్చి నుంచి మే నెలలో మనకు ఎండలు బాగానే కాస్తాయి.
కానీ గత మూడు సంవత్సరాలుగా సాధారణం కంటే తక్కువగానే ఎండలు ఉన్నాయి. చాలా మంది ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంది అని అనుకున్నారు, కానీ ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన కాదు. ఇది పసిఫిక్ లో ఏర్పడిన లా-నినా ప్రభావం. కాబట్టి రానున్న రోజుల్లో లానినా ఉండదు కాబట్టి. ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
2003, 2009, 2012, 2015, 2018 సంవత్సరాల్లో ఎల్-నినో ఏర్పడే తరుణంలో ఎండలు సాధారణం కంటే ఎక్కువగానే ఉండనున్నాయి. దీనికి తోడు మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్లడం జరిగితే వడగాల్పులు ఉండటం సాధారణం. మరి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.