Weather Latest Update: ఈ నెలాఖరుకి మరో అల్పపీడనం, ఈ జిల్లాల్లో పంజా విసురుతున్న చలి, ఎల్లో అలర్ట్!
దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ స్వల్ప ఉరుములు, మెరుపులతో చిన్నపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.
ఈ నెలాఖరులోపు ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండం అవుతుందని భావిస్తున్నారు. దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ స్వల్ప ఉరుములు, మెరుపులతో చిన్నపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. వచ్చే మూడు రోజులు పెద్దగా వర్షాలు ఉండబోవని వెల్లడించారు.
బంగాళాఖాతం వైపున ఏర్పడ్డ గాలుల సంగమం బలపడటం వలన విశాఖ నగరం, జీవీఎంసీ నగర శివారు ప్రాంతాల్లో వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. భారీ, అతిభారీ వర్షాలు ఉండవు కానీ తేలికపాటి తుంపర్లు మాత్రం ఉంటాయని చెప్పారు. నిజానికి ఏ వెదర్ మాడల్ ఈ వర్షాలను చూపలేదనితెలిపారు.
Weather warnings for Andhra Pradesh dated 24-11-2022 pic.twitter.com/6egJgMczFr
— MC Amaravati (@AmaravatiMc) November 24, 2022
‘‘ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలను ఆంధ్రప్రదేశ్ లో చూడగలము. ప్రస్తుతం విశాఖ నగరంలో మోస్తరు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అనకాపల్లి, గాజువాక వైపు మాత్రం కాసేపు వర్షాలు కొనసాగి తగ్గుముఖం పట్టనుంది. మరో వైపున ఈ వర్షాలు బంగాళాఖాతంలో కనిపిస్తున్న ఉపరితల ఆవర్తనానికి తేమను ఇస్తూ ఉంది. దీని వలన ఈ రోజు మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి అక్కడక్కడ మాత్రమే - కొనసీమ, కాకినాడ, ఎన్.టీ.ఆర్., కృష్ణా, బాపట్ల, గుంటూరు, ఉభయ గోదావరి, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో వర్షాలను చూడగలము. అక్కడక్కడ మాత్రమే కాబట్టి మా ఇంటి మీద లేదు, మా ఊరిలో లేదు అనకండి. ఈ రోజు దక్షిణ ఆంధ్రలో తక్కువగానే వర్షాలుంటాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో నేడు (నవంబరు 25) దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి (నవంబరు 26) తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని అంచనా వేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 25, 2022
‘‘ఆకాంశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 17 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
వివిధ చోట్ల చలి ఇలా..
నేడు ఉదయం 8.30 గంటలకు తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, మెదక్ లో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. సాధారణంగా 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే పసుపు రంగు అలర్ట్ చేస్తారు. అందులో భాగంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పసుపు రంగు అలర్ట్ చేశారు. నిజామాబాద్ లో 19.2, రామగుండం 16.8, హన్మకొండ 18.5, భద్రాచలం 23.5, ఖమ్మం 23.6, నల్గొండ 18.4, మహబూబ్ నగర్ 22.7, హైదరాబాద్ 18.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.