Weather Latest Update: నేడు ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణమే, కానీ అతి త్వరలో మరో అలజడి! భారీ వర్షాలకు ఛాన్స్!
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో కూడా సుమిత్రా జలసంధిపై రెండు రోజుల క్రితం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
అరేబియా మహా సముద్రంలో ఉన్న వాయుగుండం పశ్చిమ దిశలో కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం ప్రస్తుతం లేదు. కానీ వచ్చేవారానికి ఓ అల్ప పీడనం బాగా బలపడే అవకాశం ఉంది. తుపాను మాత్రం ప్రస్తుతం బంగాళాఖాతంలో లేదు. అరేబియా సముద్రంలో ఉన్న అలజడి తెలుగు రాష్ట్రాల నుంచి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఏపీ, తెలంగాణపై అంతగా ప్రభావం చూపదు. మరో నాలుగు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలో వాయుగుండంగా ఉన్న మాండస్ తుపాను భారత భూభాగానికి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఆంధ్రా, తెలంగాణ వైపుగా తేమగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు. దీనివల్ల ఉదయం సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఇటు బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో కూడా సుమిత్రా జలసంధిపై రెండు రోజుల క్రితం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రెండు, మూడు రోజుల్లో పశ్చిమ దిశగా పయనించి శ్రీలంకకు సమీపంలో అల్పపీడనంగా మారొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీలంక సమీపంలోకి వచ్చిన అల్ప పీడనం తమిళనాడు వైపుగా గానీ, శ్రీలంక వైపుగాగానీ, శ్రీలంక కింది భాగం నుంచి కూడా వెళ్లే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తమిళనాడు వైపు ట్రాక్ తీసుకుంటే తప్పకుండా ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. మాండస్ తుపాను సమయంలో పడిన భారీ వర్షాల తరహాలో వర్షాలు ఉంటాయి. రెండో ట్రాక్ తీసుకుంటే స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది. మూడో ట్రాక్ తీసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలో స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు. దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు బలపడి ఈనెల 19వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఇక తూర్పుగాలుల ప్రభావంతో మంగళవారం రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రల్లో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు మాత్రం ఏపీలో పొడి వాతావరణమే నెలకొని ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.