Weather Latest Update: నేడు ఈ జిల్లాల్లో కుండపోతే! ఆరెంజ్ అలర్ట్, భారీ గాలులు కూడా: ఐఎండీ
విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర విపత్తుల సంస్థ వెల్లడించింది.
ఈరోజు ద్రోణి / గాలి అనిచ్చితి తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు,, ఈదురు గాలులు (40 నుండి 50 కిమీ గాలి వేగంతో) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
రాగల 3 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట మీదుగా ఒక మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన ఉపరితల గాలులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో, వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
Hyderabad Weather: హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, వడగండ్లతో ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 98 శాతం నమోదైంది.
ఏపీలో నేడు వాతావరణం ఇలా
విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర విపత్తుల సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ఉరుములు మెరుపుల వర్షంతో కూడి "పిడుగులు" పడే అవకాశం ఉందని తెలిపారు. చెట్ల కింద ఎవరు ఉండవద్దని సూచించారు.
‘‘కడప జిల్లాలో నిన్న రాత్రి మొదలైన వర్షాలు ఇప్పుడు నేరుగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దీని వలన పిడుగులు, వర్షాలు అన్నమయ్య జిల్లాలోని ముఖ్యంగా మదనపల్లి - రాజంపేట ప్రాంతాల్లో మనం మరో రెండు గంటల వ్యవధిలో చూడవచ్చు. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడ అక్కడక్కడ వర్షాలను చూడగలం. మరో వైపున మధ్య ఆంధ్రలో భారీ వర్షాలు మరో గంట పాటు కొనసాగనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.