Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు ఛాన్స్
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడింది. దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పు రాష్ట్రాల్లోనూ ఉంది.
Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని, దాని ఫలితంగా ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు వెల్లడించారు. రాబోయే 3 రోజులలో ఈశాన్య భారతదేశంలో పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని పేర్కొంది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడింది. దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పు రాష్ట్రాల్లోనూ ఉంది. డిసెంబర్ 11 వరకు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయిన అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాం ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే రేపటి నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
Also Read: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి?
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని దాటినా మరికొన్ని రోజులు ఏపీపై ప్రభావం చూపుతోంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోనూ నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్రలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమలోనూ వర్షాలు కురియనున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల మాదిరిగా కాకుండా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తాయని అంచనా వేశారు.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే నేటి నుంచి డిసెంబర్ 11 వరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అత్యధికంగా మెదక్, నల్గొండ జిల్లాలో 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత ఉండగా.. హన్మకొండ ఖమ్మం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా.. మెదక్, హకీంపేట ప్రాంతాల్లో అత్యల్పంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుందని అంచనా వేసింది. మెదక్, హైదరాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా దిగొచ్చాయి.
Also Read: Gold-Silver Price: రెండోరోజూ మారని బంగారం ధరలు.. వెండి నేల చూపులు.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇలా..