Weather Updates: ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు.. మరో మూడు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు అవకాశం..!
Rains In AP: ఉపరితల ఆవర్తనం దక్షిణ శ్రీలంక తీరం దగ్గర్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో అల్పపీడనం సైతం ఏర్పడనున్నందున మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయి.
Rains In AP: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ శ్రీలంక తీరం దగ్గర్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి, నైరుతి బంగాళాఖాతం నుండి శ్రీలంక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం నవంబర్ 29న ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ అల్పపీడనం బలపడి మరో 48 రోజుల్లో వాయుగుండంగా మారనుందని తెలిపారు. ఇది మరికొన్ని గంటల్లోపశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించనుంది. ఈ అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వార్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. కోస్తాంద్రలోనూ నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: Telangana Devolopment : తెలంగాణ ఆదాయం అదుర్స్.. ఏడేళ్ల వృద్ధిపై ఆర్బీఐ లెక్కలు ఇవిగో..!
ఇదివరకే ఈ నెలలో రెండు వరుస అల్పపీడనాలు, వాయుగుండం కారణంగా ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. నవంబర్ 29 తేదీలోగా దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇటీవల కురిసిన వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ జిల్లాల వారికి మరో మూడు రోజులు వర్షపు ముప్పు తప్పదు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడపం జిల్లాలలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రైతులకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు పెను నష్టాన్ని మిగిల్చాయి. ధాన్యం తడవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఏపీ ప్రభుత్వం వరద సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకునే ప్రయత్నం కొనసాగిస్తోంది.
Also Read: ఏపీ వరి ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ .. సరిహద్దుల్లో నిలిచిన లారీలు !
తెలంగాణలోనూ వర్షాలు..
అల్పపీడనం ప్రభావం తెలంగాణపై అంతగా లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్‌లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి రెండురోజుల పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణంలో భారీ మార్పులు చోటుకోవడం లేదు. అయితే రైతులు ధాన్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !