Vizianagaram Train Accident: ట్రాక్ టెస్ట్ సక్సెస్ - ప్రమాదం తర్వాత 20 గంటల్లో ట్రాక్ పునరుద్ధరించిన అధికారులు
Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదం స్థలంలో ట్రాక్ పునరుద్ధరణను అధికారులు పూర్తి చేశారు. గూడ్స్ ట్రయల్ రన్ విజయవంతం కాగా, మరిన్ని రైళ్లు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనలో ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి నుంచి శ్రమించిన అధికారులు 20 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మతులు పూర్తి చేశారు. ఈ క్రమంలో విశాఖ - విజయనగరం డౌన్ లైన్ వైపు గూడ్స్ రైలును ట్రయల్ రన్ నడపగా, విజయవంతమైంది. అనంతరం ఆ పట్టాలపై ప్రశాంతి ఎక్స్ ప్రెస్ సైతం నడిచింది. సోమవారం సాయంత్రానికి అన్ని ప్యాసింజర్ రైళ్లను ఈ ట్రాక్ పై నడపనున్నట్లు తెలుస్తోంది.
First passenger carrying train 18463 Bhubaneswar-Bangalore Prashanti Exp passed on affected line at 1436hrs. @RailMinIndia pic.twitter.com/AZaLP23Q6N
— East Coast Railway (@EastCoastRail) October 30, 2023
#WATCH | Andhra Pradesh | The first train plies on the railway track after restoration at the spot of Vizianagaram train derailment accident. pic.twitter.com/x7w6bTLOCw
— ANI (@ANI) October 30, 2023
ప్రమాద స్థలంలో అప్ & డౌన్ లైన్ పనులు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. మిడిల్ లైన్ పనులు పూర్తయ్యేటప్పటికి సమయం పడుతుందని వెల్లడించారు. మరోవైపు, రైలు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని వాల్తేరు రైల్వే డీఆర్ఎం తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో పని చేస్తున్నట్లు వివరించారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అధికారులు నిర్ధారించినట్లు చెప్పారు. పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాతే తెలుస్తాయని అన్నారు.
బాధితులకు సీఎం పరామర్శ
విజయనగరం రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. తొలుత ఘటనా స్థలాన్ని సందర్శించాల్సి ఉండగా, పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పనులకు ఆటంకం కలగకూడదనే ఆస్పత్రిలో బాధితులను ముందుగా పరామర్శించారు. ప్రతి వార్డులోకి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను పరిశీలించిన సీఎం ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన స్థలాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
'బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే'
రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని, బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకూ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని మంత్రి బొత్స తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. అధికారం యంత్రాంగం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిందని, సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొందని అభినందించారు.
అటు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీపీఎం నేత రాఘవులు సైతం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకోవాలని కోరారు. కాగా, ఆదివారం రాత్రి విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద విశాఖ - పలాస ప్యాసింజర్ రైలును విశాఖ - రాయగడ ప్యాసింజర్ ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
Also Read: ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం - అధికారుల ప్రాథమిక నిర్ధారణ