YV Subba Reddy on AP Capital: ఏప్రిల్ నెల తర్వాత విశాఖనే రాజధాని - వైసీ సుబ్బారెడ్డి
YV Subba Reddy on AP Capital: ఏప్రిల్ తర్వాత విశాఖనే రాజధాని అని ఉత్తరాంధ్ర వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించుకుని రాజధానిని ప్రకటిస్తామన్నారు.
YV Subba Reddy on AP Capital: న్యాయపరమైన చిక్కులు తొలగించుకొని ఏప్రిల్ తర్వాత విశాఖను రాజధానిగా చేస్తామని ఉత్తరాంధ్ర వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీకాకుళంలో మంగళవారం జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా పార్టీ ప్రజాప్రతినిధులు కచ్చితంగా ఓట్లు వేయాలని వివరించారు. ఈ సమావేశానికి జిల్లాలోని మహిళా ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో గైర్హాజరు అవ్వడంపై మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎలా ఓటు వేయాలో తెలియజేయాలనే ఉద్దేశంతో సమావేశం పెడితే మహిళలు రాకుండా వారి భర్తలు హాజరు కావడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో వైసీపీకి 646 ఓట్లు ఉన్నాయని దాని కంటే ఒకటో, రెండో ఓట్లు అధికంగా పడేలా చూడాలని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే వెంటనే వారిని సస్పెండ్ చేస్తామని మంద్రి ధర్మాన ప్రసాద్ రావు హెచ్చరించారు. విశాఖకు రాజధాని వస్తే మనందని ఆర్థిక పరిస్థితి మారుతుందని చెప్పారు. అందుకు వ్యతిరేకంగా గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తారా అని ధర్మాన ప్రశ్నించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థి ముగుసులో టీడీపీ అభ్యర్థిని నిలిపారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రత్యర్థి ఎప్పుడూ టీడీపీనే అని అంతా గ్రహించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే సంక్షేమం తప్ప అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని అడుగుతున్నారని వాపోయారు. విద్య, వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి పనులు చేశామని, 1.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇలాంటివి అన్నీ వివరించాలని అప్పలరాజు సూచించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపీకి విశాఖ ఒకటే రాజధాని: మంత్రి బుగ్గన
స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రెండున్నరేళ్ల క్రితం ఏపీలో మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని, కర్నూలు న్యాయ రాజధాని అని, అమరావతి శాసన రాజధాని అంటూ మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. డెవలప్ మెంట్ వికేంద్రీకరణ కోసమే ఈ పని చేస్తున్నట్లుగా వివరించారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులోనూ పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని అని ప్రస్తావించారు. వైసీపీ నేతలు, మంత్రులు మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని లెక్కలేనన్ని సార్లు, వందలకొద్దీ ప్రెస్ మీట్లలో స్పష్టం చేస్తూ వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఆర్థిక మంత్రి బుగ్గన తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రానికి విశాఖపట్నం ఒకటే రాజధానిగా చేయబోతున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో స్పష్టంగా చెప్పారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు కోసం బెంగళూరులో మంగళవారం (ఫిబ్రవరి 14) ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు.