మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో ఊహించని షాక్‌లు- బిత్తర పోతున్న లీడర్లు
పలాసలో మంత్రి అప్పలరాజు మున్సిపాల్టీ పరిధిలోని 15 వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తున్న తరుణంలో కిషోర్ అనే వ్యక్తి తనకు పెన్షన్ అందడం లేదని గ్గగోలు పెట్టాడు.
మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా నాయకులకు నిరసన సెగలు ఎదురవుతున్నాయి. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ప్రారంభించిన శుక్రవారం రోజునే పలు చోట్ల నేతలకి చేదు అనుభవం ఎదురైంది. సామాన్యులు తమకు ఎదురవుతున్న సమస్యలను నాయకుల ముందు ఏకరువు పెట్టారు. ఈ హఠాత్పరిణామాలతో నాయకులు షాక్ అవుతున్నారు.
తాము మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం కోసం వస్తే ఇదేంటని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలాస, టెక్కలి నియోజకవర్గాలలో నేతలను సామాన్యులు ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని శాసన సభ నియోజకవర్గాల్లో కూడా వైకాపా ప్రజా ప్రతినిధులు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలను వారు ఎంచుకున్న ప్రాంతాల్లో ప్రారంభించారు.
పలాస నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజు మున్సిపాల్టీ పరిధిలోని 15 వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తున్న తరుణంలో కిషోర్ అనే వ్యక్తి తనకు పెన్షన్ అందడం లేదని గ్గగోలు పెట్టాడు. పెరాలసిస్‌తో బాధపడుతున్న తనకు ఆసరా లేదని పెన్షన్ కోసం గత ఆరు నెలలుగా మున్సిపల్ అధికారులు, సచివాలయం సిబ్బంది చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ సమయంలో మంత్రి అప్పలరాజు కల్పించుకుని వచ్చిన పనేంటి దాని సంగతి చూడండని కమిషనర్‌కి చెప్పారు.
టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడను రేషన్ లబ్ధిదారులు నిలదీశారు. టెక్కలి నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని
ప్రారంభించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి తొలి రోజు నిరసన సెగ తగిలింది. టెక్కలిలోని ఎన్ టిఆర్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను స్థానిక మహిళలు నిలదీశారు. నెలల తరబడి తమ కాలనీ వాసులకి రేషన్ బియ్యం అందడం లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేసారు. బియ్యం డోర్ డెలివరీ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.
నిలదీస్తున్న మహిళలను దువ్వాడ శ్రీనివాస్ నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ నిరసనలు తెలిపారు. స్థానిక నేతలు ఆ మహిళలను వారించే ప్రయత్నం చేసినప్పటికీ పట్టించుకోలేదు.
దీంతో సమస్యను పరిష్కరిస్తానని, మధ్యాహ్నం ఇంటి వద్దకు వస్తే అంతా మాట్లాడుకుందామని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ అక్కడ నుంచి జారుకున్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ సమస్య పరిష్కారానికి మార్గం చూపకుండా తర్వాత మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళిపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి రేషన్ అందడం లేదని చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం పట్ల వారంతా అసహనం వ్యక్తం చేశారు.
తొలి రోజు స్పందన అంతంత మాత్రమే మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినప్పటికీ పలు నియోజకవర్గాలలో నామ మాత్రంగానే ఈ కార్యక్రమం సాగింది. ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించలేదని టాక్. నాయకులు, కార్యకర్తల హడావుడి చేశారు. పార్టీ సానుభూతిపరుల ఇళ్ళకు, తెలిసిన వారి ఇళ్ళకు వెళ్ళి పార్టీ ఇచ్చిన స్టిక్కర్లను అతికించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసిన వేళ ఆయనకి మద్దతుగా నిలవాలని వైకాపా ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.