(Source: ECI/ABP News/ABP Majha)
Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదంతో ఇవాళ పలు సర్వీస్‌లు రద్దు
Vizianagaram Train Accident: విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలపై అంతరాయం ఏర్పడుతోంది.
విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలపై అంతరాయం ఏర్పడుతోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి నేటి వరకు చాలా రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారిమళ్లించారు. విశాఖ మీదుగా వెళ్లే ప్రధానమైన రైళ్లలో హౌరా సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(12703), హవ్‌రా- బెంగళూరు మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్(12245), షాలిమార్- హైదరాబాద్ మధ్య నడిచే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18045) విశాఖ గుణుపూర్, విశాఖ రాయగడ, విశాఖ పలాస మధ్య నడిచే పాజింజర్లు రైళ్లను అధికారులు రద్దు చేశారు.
విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం 15 మంది ప్రాణాలు బలి తీసుకుంది. సుమారు వంద మంది వరకు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదం అనంతరం ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి నుంచి శ్రమించిన అధికారులు 20 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మతులు పూర్తి చేశారు. ఈ క్రమంలో విశాఖ - విజయనగరం డౌన్ లైన్ వైపు గూడ్స్ రైలును ట్రయల్ రన్ నడపగా, విజయవంతమైంది. అనంతరం ఆ పట్టాలపై ప్రశాంతి ఎక్స్ ప్రెస్ సైతం నడిచింది. ప్రస్తుతానికి రైళ్లు రద్దు చేసినప్పటికీ బుధవారం నాటికి అన్ని రైళ్లను పూర్తిగా పునరుద్ధరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ప్రమాద స్థలంలో అప్ & డౌన్ లైన్ పనులు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. మిడిల్ లైన్ పనులు పూర్తయ్యేటప్పటికి సమయం పడుతుందని వెల్లడించారు. రైలు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని వాల్తేరు రైల్వే డీఆర్ఎం తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో పని చేస్తున్నట్లు వివరించారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అధికారులు నిర్ధారించినట్లు చెప్పారు. పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాతే తెలుస్తాయని అన్నారు.
బాధితులకు సీఎం పరామర్శ
విజయనగరం రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. తొలుత ఘటనా స్థలాన్ని సందర్శించాల్సి ఉండగా, పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పనులకు ఆటంకం కలగకూడదనే ఆస్పత్రిలో బాధితులను ముందుగా పరామర్శించారు. ప్రతి వార్డులోకి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను పరిశీలించిన సీఎం ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన స్థలాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
'బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే'
రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని, బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకూ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని మంత్రి బొత్స తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. అధికారం యంత్రాంగం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిందని, సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొందని అభినందించారు.
అటు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీపీఎం నేత రాఘవులు సైతం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకోవాలని కోరారు. కాగా, ఆదివారం రాత్రి విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద విశాఖ - పలాస ప్యాసింజర్ రైలును విశాఖ - రాయగడ ప్యాసింజర్ ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.