నేటితో ముగుస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈవోఐ గడువు- రేసులో సింగరేణి ఉన్నట్టా? లేనట్టా?
విశాఖ ఉక్కు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్‌లో ఆరు అంతర్జాతీయ స్టీల్ ఎక్స్ పోర్టర్స్ ఆసక్తి చూపించారు. ఓ ఉక్రెయిన్ సంస్థ జె.ఎస్.పీ.ఎల్ కూడా దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం.
విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదంపై హడావుడి చేసిన తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో ఉందా లేదా అనేది క్లారిటీ రాలేదు. ఈ సాయంత్రంతో ఈవోఐ గడువు ముగుస్తోంది. అసలు బిడ్డింగ్ వేశారా లేదా అనే విషయంలో కూడా ఎవరూ నోరు మెదపడం లేదు. సింగరేణి నుంచి కూడా ఎలాంటి సమాచారం రావడం లేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ కేపిటల్, ముడిసరకు కోసం బిడ్లను దాఖలు చేయాలని ఈ మధ్య నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ గడువు శనివారం సాయంత్రం నాలుగు గంటలతో ముగిసింది. అయితే చాలా సంస్థలు ఆసక్తితో ఉన్నాయని మరికొన్ని రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆ గడువును ఏప్రిల్ 20 అంటే ఇవాల్టి వరకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పొడిగించింది.
ఇలా సమయం కావాలని కోరిన వారిలో తెలంగాణ తరఫున సింగరేణి సంస్థ కూడా ఉంది. మొదటిసారి ఇచ్చిన గడువులోపు సింగరేణి సంస్థ బిడ్ దాఖలు చేయలేదు. బిడ్ దాఖలుకు ఆ రోజు సాయంత్రం వరకు సమయం అడిగారు. తర్వాత సమయాన్ని పెంచిన విషయాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆ రెండు రోజులు హడావుడి చేసి అధికారులు తర్వాత ఆ విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ప్రజాప్రతినిధులు కూడా దీనిపై మాట్లాడటం లేదు. గడువు ఇవాల్టితో ముగియనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తరఫున సింగరేణి బిడ్ దాఖలు చేసినట్టు సమాచాం కూడా లేదు. అసలు రేస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఉందా లేకుంటే తప్పుకుందా అనేది తేలాల్సి ఉంది.
ఆ టైంలో తీవ్ర రాజకీయ దుమారం కూడా రేగింది. స్టీల్ ప్లాంట్ కోసం కేసీఆర్ ఎంత పోరాటానికైనా సిద్ధమని ఏపీ బీఆర్‌ఎస్ నేతలు ప్రకటనలు చేశారు. ఇంతలో కేంద్ర సహాయమంత్రి వచ్చి వెనక్కి తగ్గుతున్నట్టు చేసిన ప్రకటనతో సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే అదంతా మీడియా ప్రచారమని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గడం లేదని కేంద్రం ప్రకటించడం తెలిసిందే.
ఇలా స్టీల్ ప్లాంట్ కేంద్రంగా రాజకీయం ఉక్కు కంటే హాట్‌గా సాగింది. కచ్చితంగా పోటీలో తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని బీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు ప్రకటనలు కూడా చేశారు. పనిలో పనిగా సింగరేణి అధికారుల బృందం పరిశీలనకు కూడా వెళ్లింది.
ఇంత చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు బిడ్ వేయలేదని తెలుస్తోంది. హడావుడి చేసి ఇప్పుడు సడెన్‌గా సైలెంట్ అవ్వడంపై అనేక చర్చలు మొదలయ్యాయి. బిడ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఉందా లేదా అనేది గడువు తర్వాత తేలనుంది.
విశాఖ ఉక్కు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్‌లో ఆరు అంతర్జాతీయ స్టీల్ ఎక్స్ పోర్టర్స్ ఆసక్తి చూపించారు. ఓ ఉక్రెయిన్ సంస్థ జె.ఎస్.పీ.ఎల్ కూడా దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం. JSW, MS అగర్వాల్ కూడా పోటీలో ఉన్నారు. వైజాగ్ ప్రొఫైల్, నారాయణ ఇస్పాత్ వంటి సంస్థలు ఈవోఐ బిడ్లు దాఖలు చేశాయి.
ప్రైవేట్ కంపెనీ తరఫున మాజీ జేడీ లక్ష్మీనారయణ కూడా రెండు బిడ్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉక్కుపరిశ్రమ కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించబోతున్నట్టు ప్రకటించారు. ఎనిమిదిన్నర కోట్లు ఉన్న తెలుగు ప్రజలు నెలకు వంద రూపాయలు ఇచ్చినా 850 కోట్లు వస్తాయన్నారు. ఇలా చేస్తే స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకునే వాళ్లం అవుతామన్నారు.
స్టీల్ ప్లాంట్‌కు మూలధనం కోసం జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్... స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అన్నట్లుగా ప్రచారం జరగడంతో రాజకీయంగానూ చర్చనీయాంశం అయింది. అయితే ఈ బిడ్ గెల్చుకున్న వారు మూలధనం సమకూర్చి దానికి తగ్గట్లుగా తక్కువ ధరకు స్టీల్ మాత్రమే కేటాయిస్తారని ఎలాంటి యాజమాన్య హక్కులు రావని స్టీల్ ప్లాంట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.