Visakha News: విశాఖ నోట్ల మార్పిడి కేసులో నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు- పోలీసు అధికారి స్వర్ణలత చుట్టూ బిగుసుకున్న ఉచ్చు
Visakha News: హోంగార్డ్స్ ఆర్ఐ స్వర్ణలత సహా నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే స్వర్ణలతపై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేశారు.
Visakha News: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. అమాయకులను బెదిరిస్తూ.. అప్పనంగా డబ్బులు దోచేస్తున్నారు. అయితే తాజాగా 90 లక్షల రూపాయల విలువ చేసే 500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువ చేసే 2000 నోట్లు ఇస్తామంటూ రప్పించుకొని.. బాధితులపై బెదిరింపులకు పాల్పడ్డారు హోంగార్డ్స్ ఆర్ఐ స్వర్ణలత. ఈ కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. 2000 రూపాయల కరెన్సీ ముఠా కేసులో నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేశారు. ద్వారకా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 61/2023 గా కేసు నమోదు కాగా.. స్వర్ణలత సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు రిటైర్డ్ నేవీ ఆఫీసర్ల నుంచి డబ్బులు కొట్టేయడంలో స్వర్ణలతకు కానిస్టేబుల్, హోంగార్డ్ సహకరించి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. స్వర్ణలతోపాటు మిగతా ముగ్గురు నిందితులపై 386, 341, 506 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 12 లక్షల్లో స్వర్ణ లత 5 లక్షలు నొక్కేశారని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆమె సిబ్బంది మరో రెండు లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది.
ఈ నగదు మార్పిడి వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న సూరిబాబు బాధితులను బెదిరించి 5 లక్షలు లాగేశారు. ఇలా వసూలు చేసిన 12 లక్షల రూపాయల బ్యాగుతో సూరిబాబు పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు. అయితే బాధితులైన నేవీ రిటైర్డ్ ఆఫీసర్లు శ్రీధర్, హేమ సుందర్ లు అతడిని అడ్డుకున్నారు.
అక్కడే కథ మరో మలుపు తిరిగింది. తనను శ్రీధర్, హేమసుందర్ అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన సూరిబాబు.. అనుచరులను పిలిపించాడు. తనపై దాడికి పాల్పడుతున్నారంటూ ముగ్గురు వ్యక్తులకు ఫోన్ చేసి పిలిచాడు. దీంతో అక్కడకు చేరుకున్న స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించారు. ఈక్రమంలోనే ఎంవీపీ పోలీసులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
స్వర్ణలత వద్ద కోటి రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు వరకూ ఉన్నాయి. ఇటీవలే రెండు వేల రూపాయలను తిరిగి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో వాటిని ఎలాగైన మార్చుకోవాలనుకున్నారు. నేరుగా బ్యాంకుకు వెళ్లలేదు. తెలిసిన వాళ్ల ద్వారా తన వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను ఎవరికైనా అంటగట్టాలనుకున్నారు. ఈ క్రమంలోనే సదరు అధికారికి ఓ నేవీ రిటైర్డ్ అధికారులు తగిలారు. వారి వద్ద కోటి రూపాయల వరకు నగదు ఉందని గ్రహించిన ఆ అధికారి వారికి టోకరా వేశారని టాక్.
90 లక్షల రూపాయల 500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయలు ఇస్తానన్న మాట వాళ్లతో చెప్పారు స్వర్ణలత గ్యాంగ్. వాళ్లు కూడా ఓకే అన్నట్టు సమాచారం. రెండు గ్రూప్‌ల మధ్య డీల్ కుదిరిన తర్వాత నోట్ల మార్పిడీ జరిగింది. అయితే ఇక్కడే అధికారి తన తెలివితేటలు ఉపయోగించారు. పోలీసు అధికారి మాటలు నమ్మిన రిటైర్డ్ నేవీ ఆఫీసర్లు శ్రీధర్, హేమ సుందర్ లు 90 లక్షల విలువ చేసే 500 రూపాయల నోట్లు పట్టుకొని వచ్చారు. ఈ క్రమంలోనే వీరి వద్ద నుంచి స్వర్ణలతు అండ్ గ్యాంగ్ 12 లక్షల రూపాయలు కొట్టేసింది.