Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి జేసీబీలతో హైడ్రామా! భారీగా టీడీపీ శ్రేణులు, ఉద్రిక్తత
స్థానిక చినబాడాం రోడ్డులో ఉన్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు ఇంటి రహదారి కల్వర్టును కూల్చేందుకు అధికారులను మంత్రి ఉసిగొల్పారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. మంత్రి అప్పలరాజు ఆదేశాలతో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు ఇంటికి వెళ్లే రహదారి కాల్వర్టును తొలగించడానికి అధికారులు ప్రయత్నించారు. మంత్రి అప్పలరాజు ఒత్తిడితో అధికారులు జేసీబీలతో కల్వర్టును కూల్చేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఇంచార్జ్ గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాలం అశోక్ స్థానిక నేతలతో కలిసి అక్కడికి వెళ్లారు. అధికారుల తీరును తప్పు పట్టారు. ఇటీవల తాలభద్రలో జరిగిన టీడీపీ సభలో టీడీపీ నేతలు మంత్రి అప్పలరాజుపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో సభలో తనపై విమర్శలు చేసిన టీడీపీ నేతలను మంత్రి అప్పలరాజు టార్గెట్ చేశారు.
దీనిలో భాగంగానే స్థానిక చినబాడాం రోడ్డులో ఉన్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు ఇంటి రహదారి కల్వర్టును కూల్చేందుకు అధికారులను మంత్రి ఉసిగొల్పారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇరిగేషన్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు కల్వర్టు తొలగింపునకు చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. టీడీపీ నేతలు అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు, టీడీపీ శ్రేణులు భారీగా రావటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారుల తీరుపై నిరసనకు దిగిన టీడీపీ నేతలను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, గౌతు శిరీషకు 151 కింద ముందస్తు నోటీసులు ఇచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారు.