Court Saves Schoos : తురువోలు పోరాటం వల్లే స్కూళ్లకు రక్షణ ! ఆ గ్రామం స్ఫూర్తి కథ ఇదే
తురువోలు యువత పోరాటంతో ఏపీ వ్యాప్తంగా స్కూల్లకు రక్షణ లభించింది. స్కూళ్లలో గ్రామ సచివాలయాలు.. ఆర్బీకేలు పెట్టకుండా కోర్టు ఆదేశించింది.
ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు శిక్ష పడడమే కాదు వారు బేషరతుగా హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనికి కారణం విశాఖ జిల్లా లోని మారుమూల గ్రామమైన తురువోలు. చోడవరానికి దూరంగా ఉన్న చీడికాడ మండలం లోని తురువోలు 3వేలమంది జనాభా ఉన్న చిన్న ఊరు . ఉదయం ,సాయంత్రం తిరిగే ఒక బస్సు మాత్రమే ఇక్కడ ప్రధాన రవాణా మార్గం . ఈ ఊరుదాటిన తరువాత ఏజెన్సీ ప్రాంతం మొదలవుతుంది . ఇంత చిన్న ఊరు పెద్ద ఘనతనే సాధించింది . తమ ఊరిలోని పాఠశాల లో గ్రామ సచివాలయాన్ని నిర్మించడానికి ప్రయత్నించిన అధికార బలాన్ని బలగాన్ని ఎదిరించడమే కాదు . న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాలయాల్లో ఎటువంటి గ్రామ సచివాలయాలు ,ఇతర ప్రభుత్వ సంబంధిత కార్యాలయాలు లేకుండా చేసేందుకు ముందడుగు వేసింది .
తురువోలు స్కూల్‌లో గ్రామ సచివాలయం - వ్యతిరేకించిన గ్రామస్తులు !
తురువోలు లోని ప్రాథమిక పాఠశాల లో ఒకప్పుడు 200 కిపైగా విద్యార్థులు ఉండేవారు . తురువోలు మాత్రమే కాక చుట్టుపక్కల ఇతర పల్లెల నుండీ చదువుకొనడానికి పిల్లలు ఇక్కడకు వచ్చేవారు . అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదలుపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ పాఠశాలకు శాపంగా మారింది . ఈ స్కూల్ లో ఉన్న ఖాళీ స్థలంలో గ్రామ సచివాలయాన్ని కట్టడానికి అధికారులు సన్నాహాలు చేశారు. దీనికి స్థానిక రాజకీయ నేతలు ఒత్తిడి కారణమని గ్రామస్తులు చెబుతారు . పిల్లలు చదువుకునే చోట గ్రామ సచివాలయం నిర్మించడం ఏంటి అంటూ ఊరి పెద్దలు ,యువకులు స్థానిక నేతలను ,ఎమ్మెల్యే ను కలిసినా వారు లెక్కచెయ్యక పోగా .. అంతవరకూ పిల్లలకు స్కూల్లో నీడనిచ్చిన పెద్ద పెద్ద చెట్లను సైతం కొట్టివెయ్యడం తో అదే ఊరికి చెందిన సురేష్ అనే యువకుడు 2020 జూన్ లో కోర్టును ఆశ్రయించాడు . దీనితో తనపై అనేక ఒత్తిళ్లు వచ్చాయని సురేష్ చెబుతున్నారు . అయినప్పటికీ భయపడకుండా కోర్టు తీర్పుకోసం ఎదురుచూశారు. చివరికు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు వెంటనే పాఠశాలలనుండి గ్రామ సచివాలయాలు తొలగించమని ఆదేశాలు జారీ చేసింది . ఒక్క తురువోలు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1300 పాఠశాలకూ వర్తించేలా కోర్టు తీర్పు ఇచ్చింది . కేవలం గ్రామ సచివాలయాలు మాత్రమే కాకుండా రైతు భరోసా కేంద్రాల వంటి వాటిని కూడా పాఠశాలల్లో ఏర్పాటు చెయ్యడానికి వీలులేదని ,ఆల్రెడీ ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలని హైకోర్టు తీర్పు చెప్పింది .
తురువోలు స్ఫూర్తితో అన్ని స్కూళ్లకూ మేలు
ఒక్క తురువోలు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం ప్రయత్నించిన గ్రామ సచివాలయాలను వెంటనే అక్కడి నుండి తీసివెయ్యాలని కోర్టు తెలిపింది . పిల్లలు చదువుకునే చోట వారి చదువులకు భంగం కలిగించే ఎలాంటి కార్యకలాపాలు జరగడానికి వీలులేదని కోర్టు తెలిపింది . దీనిని పెడచెవిన పెట్టిన అధికారులు కొన్నిచోట్ల మాత్రమే సచివాలయాలును స్కూళ్ళనుండి తొలగించగా మరికొన్ని చోట్ల మాత్రం వాటిని అలానే ఉంచేశారు . దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . ఇది జరిగి రెండేళ్లు దాటిపోవడంతో దీన్ని కోర్టు ఉల్లఘన గా భావిస్తూ న్యాయస్థానం ఎనిమిది మంది ఐఏఎస్‌లకు శిక్ష విధించింది . దీనితో వెంటనే ఆ మిగిలిన స్కూళ్ల లోని గ్రామ సచివాలయాలను కూడా వెంటనే అక్కడి నుండి తరలించడమే కాకుండా నిర్మాణం లో ఉన్న వాటిని కూడా ఆపివేశారు. ఈ దీనితో తురువోలు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేషారు .
నిర్మాణం ఆపినా .. ఇంకా తొలగించని పునాదులు :
ఇంత జరిగినా తురువోలు గ్రామ పాఠశాలలో గ్రామ సచివాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పునాదులు ,ఐరన్ పిల్లర్లు ఇంకా అలానే ఉన్నాయి . నిర్మాణ పనులు ఆపివేసినా ఆ పిల్లర్లను ఇంకా తొలగించడం లేదనీ దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామని గ్రామస్థులు చెబుతున్నారు . కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ పునాదులను కూడా వెంటనే తీసివెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు .