KA Paul: స్టీల్ ప్లాంట్ మీద బీజేపీ డ్రామా, త్వరలోనే కొత్త కార్యక్రమంతో ముందుకు - కేఏ పాల్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని.. అందుకోసం త్వరలోనే ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ అన్నారు.
![KA Paul: స్టీల్ ప్లాంట్ మీద బీజేపీ డ్రామా, త్వరలోనే కొత్త కార్యక్రమంతో ముందుకు - కేఏ పాల్ Prajashanti party president KA Paul accuses BJP MPs over vizag steel plant issue KA Paul: స్టీల్ ప్లాంట్ మీద బీజేపీ డ్రామా, త్వరలోనే కొత్త కార్యక్రమంతో ముందుకు - కేఏ పాల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/e369f496e8238f4f290b0538b13970031719486477944234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KA Paul on Vizag Steel Plant: ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ విషయంలో నిన్న బీజేపీ ఎంపీలు ఆడిన డ్రామా ప్రజలు గమనించారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుండగా, ఆ పార్టీ ఎంపీలు ప్రధాని బదులుగా ఉక్కు శాఖ మంత్రిని కలవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో గంగవరం పోర్టు కూడా అదానికి కారు చౌకగా అమ్మేశారని గుర్తు చేశారు. అదానీ, అంబానీ, జిందాల్ మిట్టల్ కు కేంద్రం సంపద దోచి పెడుతుందని.. 8 లక్షల కోట్ల విలువ గల స్టీల్ ప్లాంట్ ను కేంద్రం కారు చౌకగా విక్ర యించాలి అని చూడడం అన్యాయం అన్నారు.
ప్రధాని మోదీ కోర్టు ఆదేశాలు పాటించాలి. ప్లాంట్ అమ్మకుండా స్టేటస్ కో ఇచ్చింది అని, ఉత్తర్వులు ఇప్పుడే తనకు అందాయి అన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, సుజనా చౌదరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, వినతి పత్రం ఇవ్వడం డ్రామా యాక్టర్స్ ని తలపించారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, ఎంపీ భరత్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఏప్రిల్ 25 న స్టీల్ ప్లాంట్ ఆస్తులు అమ్మకూడదు అంటూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ‘‘ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ కి రక్షణ లేకుండా పోయింది. స్టీల్ ప్లాంట్ కాపాడాలి. వంద రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి. ఈ ఎన్నికలు ఈవీఎం మాయ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు మిస్సింగ్ మీద ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు’’ అని ప్రశ్నించారు. జగన్ మాతోనే వున్నాడు అని మోదీ స్పీకర్ ఎన్నిక కోసం వైసీపీ మద్దతు కోరడమే నిదర్శనం అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)