Plastic Flexies Ban: ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్, రేటు ఎక్కువైనా అలాంటివి పెట్టుకోండి: సీఎం ప్రకటన
బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై సీఎం మాట్లాడుతూ.. ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా చెప్పారు
ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. నేడు విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై సీఎం మాట్లాడుతూ.. నేడు ఒక్కరోజే ఉదయం 6 నుంచి 8 వరకూ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారని సీఎం జగన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి అనేవి నాణేనికి రెండు వైపులు అని జగన్ అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదని జగన్ అన్నారు. ఈ సందర్భంగా సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఈ ఎంవోయూ కుదిరింది.
భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీ సైకిల్ చేసి కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాకుండా, పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారని సీఎం జగన్ వెల్లడించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ ని ఏపీలో తొలి అడుగుగా సీఎం జగన్ చెప్పారు. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన షూస్, కళ్ల జోడులను సీఎం స్వయంగా చూపించారు. ఆయన కళ్ల జోడు ధరించగానే కన్వెన్షన్ హాల్ మొత్తం ఈలలతో దద్దరిల్లింది.
ప్రపంచంలోనే మెగా బీచ్ క్లీనింగ్
సముద్ర తీరం ప్రాంతంలోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి స్వచ్ఛత నెలకొల్పే లక్ష్యంగా విశాఖపట్నంలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. అమెరికాకు చెందిన పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది. గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ గొలగిని వెంకట హరి కుమారి, కలెక్టర్, పోలీస్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. వీరు కూడా చెత్త సేకరించి బీచ్ ను శుభ్రం చేసే పనిలో భాగం అయ్యారు.
ఇందుకోసం శుక్రవారం (ఆగస్టు 26) ఉదయం ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా విశాఖ తీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని ఎత్తేు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్ లో దాదాపు 20 వేల మందికి పైగా వలంటీర్లు పాల్గొన్నారు. బీచ్ రోడ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎత్తేసేందుకు అక్కడే రూపొందించిన ఇసుక శిల్పం పర్యటకులను ఆకట్టుకుంటుంది.
కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడం ద్వారా విశాఖ నగరాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్లాస్టిక్ నిషేధించడం ద్వారా పర్యావరణం కాపాడుకోవచ్చని అన్నారు. పర్యావరణం బాగుంటేనే ప్రపంచం బాగుంటుందని, ప్లాస్టిక్ నిషేధం వల్ల సముద్ర జీవరాశులకు మేలు కలుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కావడం సంతోషకరమని అన్నారు.
రీసైక్లింగ్ ద్వారా ఆదాయం
ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. అందుకే అమెరికాకు చెందిన పార్లె సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా భారత నేవీ హెలికాప్టర్ల ద్వారా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.