No Tigers In Vizag Forest: వైజాగ్ అడవుల నుంచి పెద్దపులులు మాయం ?
దేశ వ్యాప్తంగా పెద్దపులుల సంఖ్య పెరుగుతోందని పులుల జాడలను కనిపెట్టేందుకు చేసిన సర్వేలో వెల్లడైంది. వైజాగ్ అడవుల్లో మాత్రం అలాంటి జాడ కనిపించడం లేదు. అయితే కాకినాడలో సంచరిస్తున్న పెద్దపులి ఎక్కడిదీ?
ఉమ్మడి విశాఖ జిల్లా అడవుల్లో గత నెల రోజులుగా సాగించిన వన్యప్రాణుల గణనలో ఆశక్తికర అంశాలు తేలాయి. వైజాగ్ చుట్టు పక్కల ఉన్న అరణ్యప్రాంతాల్లో పెద్దపులి జాడ కనపడలేదు. 80కిపైగా సీసీ టీవీ కెమెరాలను అమర్చి అటవీశాఖ నిర్వహించిన సర్వేలో చిరుతపులులు మాత్రం ఎక్కువగానే ఇక్కడి అడవుల్లో సంచరిస్తున్నట్టు గమనించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల్లోని అడవుల్లో 40 పాయింట్స్ గుర్తించి అక్కడ ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. జంతువుల కదలికలను అనుక్షణం గుర్తించేలా ఇన్ఫ్రా రెడ్ కెమెరాలను పెట్టారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ చేపట్టిన పెద్దపులుల గణనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపట్టింది. కంబాల కొండ, అరకు ,పాడేరు , చింతపల్లి లాంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఈ సర్వే చేపట్టారు .
పెద్దపులులు లేకున్నా.. చిరుతలు మాత్రం ఉన్నాయి :
అటవీశాఖ చేపట్టిన సర్వేలో టైగర్స్ కనపడకపోయినప్పటికీ.. చిరుతపులులు మాత్రం విశాఖ అడవుల్లో ఎక్కువగానే ఉన్నట్టు స్పష్టమైంది . చిరుతలతోపాటు, తోడేళ్ళు, సాంబార్ దుప్పి, చుక్కల దుప్పి, నీల్ గాయ్, అడవి పందులు, కుందేళ్లు, కృష్ణ జింకలు, కొండగొర్రె లాంటి జంతువులతోపాటు అనేక అరుదైన పక్షులను సైతం అటవీ శాఖ గుర్తించింది.
కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న పులి ఎక్కడిది ?.
ఇన్నాళ్లూ కాకినాడ జిల్లా వాసులను బెంబేలిస్తున్న పెద్దపులి విశాఖ లేదా విజయనగర అటవీ ప్రాంతాల నుంచి దారి తప్పి వచ్చి ఉంటుంది అని ఒక వాదన వినిపించింది. అయితే అసలు విశాఖ అటవీ ప్రాంతంలో పెద్దపులులు లేవని ప్రాథమికంగా తేలడంతో ఈ పులి ఎక్కడిది అన్న కొత్త చర్చ మొదలైంది. దీనికి సరైన సమాధానం తెలియాలంటే మరికొంత సమయం పట్టొచ్చు అని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.
నెలరోజుల్లో పూర్తి వివరాలు- అధికారులు
ప్రస్తుతం ఈ సర్వేకి చెందిన మొత్తం ఫుటేజ్ శ్రీశైలంలోని బయోలాజికల్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. దానిపై పూర్తి అధ్యయనానికి మరో నెలరోజుల సమయం పట్టొచ్చు అని అది పూర్తయితే మరిన్ని ఆసక్తికర అంశాలు బయట పడొచ్చు అని అధికారులు అంటున్నారు.
ఇక ఏపీలో నాగార్జున సాగర్ -శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్‌లోనూ పాపికొండలు అభయారణ్యంలోనూ ఎక్కువగా ఉన్నాయి. 2020 పులుల గణన ప్రకారం ఏపీలో 48 పెద్దపులులు ఉండగా దేశం మొత్తం మీద అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 526, కర్ణాటకలో 524 ఉన్నాయి. ఇండియా మొత్తం మీద పెద్దపులుల సంఖ్య 2,975 గా అధికారులు లెక్కించారు.