Vizag News: గుడివాడ అమర్నాథ్ Vs నారా లోకేష్ - విశాఖలో కేడర్ మధ్య వార్
Visakhapatnam: విశాఖలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రంగా వైసిపి, టిడిపి క్యాడర్ మధ్య వార్ కొనసాగుతోంది.
Minister Amarnath vs Nara Lokesh: విశాఖలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రంగా వైసీపీ, టీడీపీ క్యాడర్ మధ్య వార్ కొనసాగుతోంది. శంఖారావం పేరుతో నారా లోకేష్ నిర్వహిస్తున్న సభల్లో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన జిల్లా మంత్రి అమర్నాథ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి అమర్నాథ్ ఐటి శాఖ మంత్రిగా పనిచేస్తూ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదంటూ లోకేష్ ఆరోపించారు. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ గుడ్డు పగిలింది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేష్.. ఒక గుడ్డును మంత్రికి కానుకగా పంపించారు. దీనిపై ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంతే ధీటుగా బదులిచ్చారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి లోకేష్ చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు చేసిన మంత్రి అమర్నాథ్.. తనకు లోకేష్ గుడ్డు పంపిస్తే.. మంత్రి నారా లోకేష్ కు పప్పు అన్నాన్ని పంపిస్తున్నట్టు ఎద్దేవా చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో కుండలో తీసుకువచ్చిన పప్పు అన్నాన్ని లోకేష్ కు పంపిస్తున్నట్లు చూపించారు. ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం కాస్త క్షేత్రస్థాయిలో కేడర్ కు పాకింది.
మంత్రి అమర్ చిత్రపటాన్ని గుడ్డుతో కొట్టి నిరసన తెలిపిన టిఎన్ఎస్ఎఫ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పప్పు అన్నం పంపించడంతోపాటు విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్నంగా గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సెవెన్ హిల్స్ జంక్షన్లో మంత్రి అమర్నాథ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కోడిగుడ్లతో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కొట్టారు. 2019లో పొదిగిన గుడ్డు.. 2024 పగులుతుందంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంతోపాటు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ విశాఖకు ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చావో చెప్పాలని ఈ సందర్భంగా ప్రణవ్ డిమాండ్ చేశారు. ఐదేళ్లలో తీసుకువచ్చిన పెట్టుబడుల గురించి వివరించాలని డిమాండ్ చేశారు. చేసిన అభివృద్ధి, తెచ్చిన పరిశ్రమల గురించి చెప్పుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. పేకాటలో జోకర్ మాదిరిగా వైసీపీలో అమర్ తయారయ్యాడని విమర్శించారు.
లోకేష్ కు పప్పు అన్నం తినిపించిన వైసీపీ శ్రేణులు
మంత్రి అమర్నాథ్ ఫ్లెక్సీను కోడిగుడ్లతో టీడీపీ శ్రేణులు కొట్టడానికి నిరసిస్తూ వైసీపీ శ్రేణులు అంటే స్థాయిలో బదులిచ్చారు. వైసీపీ జిల్లాన యువజన విభాగం అధ్యక్షులు ఆళ్ల శివ గణేష్, ఎస్సీ విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో అదే సెంటర్లో నారా లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పప్పును తినిపించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఫ్లెక్సీలకు పప్పు కలిపిన అన్నం ముద్దలను తినిపించారు. పప్పు లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ చిత్రపటానికి పప్పుతో అభిషేకం చేశారు. మంత్రి అమర్నాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు ఏది ఇచ్చిన తిరిగి ఇవ్వడం అలవాటని, దీన్ని గుర్తుంచుకోండి టీడీపీ శ్రేణులు వ్యవహరించాలని వైసీపీ నాయకులు విమర్శించారు. నారా పులకేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని శివ గణేష్, శివ రామకృష్ణ హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేను విధంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు రోడ్డు ఎక్కి మరి ఆందోళనలు చేస్తుండడంతో నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.