Ring Nets: రింగువలల వివాదంపై కీలక ఒప్పందం, మంత్రి అప్పలరాజు సమక్షంలో చర్చలు!
Ring Nets: విశాఖపట్నంలో రింగువలల విషయంలో పెద్దజాలరిపేట, వాసవాణిపాలెం గ్రామాల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. ఇరుగ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.
Ring Nets: విశాఖపట్నంలో రింగు వలల వివాదం మళ్లీ తలెత్తింది. పెద్దజాలరిపేట, వాసవాణిపాలెం గ్రామాల మధ్య ఈ వివాదం మరోసారి చర్చకు దారి తీసింది. రింగు వలల వివాదం గురించి తెలుసుకున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెంటనే స్పందించి విశాఖ జిల్లా కలెక్టర్, డీసిపి తో పాటు సంబంధిత అధికారులతో ఫోన్ లైన్ ద్వారా మాట్లాడి శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకొని ఇరు వర్గాలు మధ్య ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా చూడాలని, తాను తిరుపతి జిల్లా పర్యటన నుంచి తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో ఇరువర్గాల వారితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై శాశ్వాత పరిష్కారం చూపాలని తెలిపారు.
మత్స్యకారులతో సీదిరి చర్చలు..
తిరుపతి జిల్లా పర్యటన అనంతరం ఈ రోజు ఉదయం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన వైయస్సార్ కాపు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.. అనంతరం అక్కడి నుండి విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి డాక్టర్ సీదిరి పాల్గొన్నారు.
నిబంధనలకు కట్టుబడాలి..
ఈ సందర్భంగా ఇరు వర్గాల మత్స్యకారులతో మాట్లాడి గతంలో ఏదైతే నియమ నిబంధనలు సూచించారో వాటికి లోబడే వేటలు చేసుకోవాలని సూచించారు. అలాగే ఘర్షణలో భాగంగా తెప్పలు, వలలు ధ్వంసం అయ్యాయో.. దీనికి సంబంధించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సీదిరి అధికారులను ఆదేశించారు. నిందితులను గుర్తించి చట్ట పరంగా ముందుకు వెళ్లాలని తేల్చి చెప్పారు. నష్ట పోయిన మత్స్యకార వర్గీయులకు అందివ్వాలని మంత్రి డాక్టర్ సీదిరి సూచించారు.
సామరస్యంగా మాట్లాడుకోవాలి..
భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తితే సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకోవాలని, ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో మంత్రి డాక్టర్ సీదిరితో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, డిసీపి సుమిత్ సునీల్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, ఫిషరీస్ ఏడి, మత్స్యకార పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు.
అసలేం జరిగిందంటే..?
శుక్రవారం తెల్లవారుజామున రింగు వలలతో కూడిన పడవలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆ మంటలను గుర్తించిన వాసవానిపాలెం, జాలరి ఎండాడకు చెందిన మత్స్యకారులు ఆ మంటలను ఆర్పేశారు. పెద్దజాలరిపేటకు చెందిన వారే మంటలు పెట్టి ఉంటారని పెద్దజాలరిపేటకు చెందిన మూడు మర పడవలను ఎత్తుకొచ్చారు. తీరానికి తీసుకువచ్చిన మర పడవలను విడిచి పెట్టాలని అధికారులు పెద్దలను కోరారు. తమ వలలకు నిప్పు పెట్టిన వారిని అరెస్టు చేయడమే కాకుండా... తమకు జరిగిన నష్టాన్ని ఇప్పిస్తేనే మర పడవలను విడిచి పెడతామని వారు కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులు, మత్స్యకారుల కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులను తోసివేశారు. దీంతో ఆయా మత్స్యకార గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.