(Source: ECI/ABP News/ABP Majha)
Vangalapudi Anitha: కర్నూలు టీడీపీ నేత హత్యపై హోంమంత్రి స్పందన, వాళ్లని వదిలేది లేదని హెచ్చరిక
Vizag News: విశాఖపట్నంలోని బెల్లం వినాయకుడిని, సంపత్ వినాయకుడిని కుటుంబ సమేతంగా అనిత దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశాక.. తర్వాత మీడియాతో మాట్లాడారు.
Kurnool Murder Issue: కర్నూలు జిల్లాలో జరిగిన టీడీపీ నేత హత్య ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. హత్య ఘటనలో నిందితుల కోసం వెతుకుతున్నామని.. ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని హోంమంత్రి తెలిపారు. తాను ఇప్పటికే కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడానని, నిందితుల్ని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం విశాఖలోని బెల్లం వినాయకుడిని, సంపత్ వినాయకుడిని కుటుంబ సమేతంగా వంగలపూడి అనిత దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశాక.. తర్వాత మీడియాతో మాట్లాడారు.
జగన్ గురించి మాట్లాడుతూ.. వైసీపీ నాయకులను చంపేస్తున్నారని ఆయన గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఇప్పుడు టీడీపీకి చెందిన నాయకుడు హత్యకు గురయ్యారని అన్నారు. వైసీపీ నేతలు కావాలనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేకుండా కుట్రలు చేస్తున్నారని.. తరచూ రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటిదాకా హత్య చేసిన ఘటనలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని అనిత తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 రాజకీయ హత్యలు జరిగాయని గుర్తు చేశారు. దాంట్లో ముగ్గురు టీడీపీకి చెందిన వారే అని అన్నారు. వైసీపీ నేతలే అనాగరికంగా హత్య చేశారని ఆరోపించారు. గతంలో జగన్ హాయాంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ను చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని అనిత గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని జగన్ ఎమ్మెల్సీ పదవిలోనే ఉంచి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వ్యక్తి.. రోడ్లుపైకి వచ్చి రచ్చ చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ నేత దారుణ హత్య
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీను అనే 45 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం వేళ బహిర్భూమికి వెళ్లిన వేళ అతడి కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దుండగులు నరికారు. గత ఎన్నికల వేళ హోసూరు గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ తేవడంలో వాకిటి శ్రీను కూడా కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు.
హోసూరు గ్రామంలో కూడా టీడీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అందుకే తమ గ్రామంలో భారీ మెజారిటీ రావడానికి శ్రీనివాసులే కారణమని భావించి... సమయం చూసి శ్రీనును రాజకీయ ప్రత్యర్థులు చంపినట్లుగా భావిస్తున్నారు.