Google Data Center: అవును.. గూగుల్ వైజాగ్ వచ్చేస్తోంది..! ఏకంగా 50వేల కోట్లు.. కన్ఫామ్ చేసిన ఐటీమంత్రి లోకేష్
Google Data Center: ఇప్పుడు ఇది అఫీషియల్.. ! విశాఖపట్నానికి గూగుల్ వస్తోంది. గూగుల్ ఇండియాలో ఏకమొత్తంలో పెట్టే అతిపెద్ద పెట్టుబడి ఇదే కాబోతోంది.

Google Data Center to Vizag: సిటీ ఆఫ్ డెస్టినీ City of Destiny విశాఖపట్టణం.. ఇప్పుడు అంతర్జాతీయ టెక్ దిగ్గజం Googleకు డెస్టినేషన్ కాబోతోంది. వైజాగ్‌కు గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. Google మాతృసంస్థ ఆల్ఫాబెట్ Alphabet విశాఖలో 1గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 6బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే షుమారు 50వేలకోట్లకు పైగా దీనిపై గూగుల్ వెచ్చించనుంది. డేటా సెంటర్ల మీద బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్న గూగుల్.. తమ స్ట్రాటజిక్ లొకేషన్‌గా విశాఖను ఎంచుకుంది. ఎప్పటి నుంచో గూగుల్ విశాఖకు వస్తోందనే ప్రచారం జరుగుతోంది కానీ.. అటు ప్రభుత్వం కానీ.. ఇటు ఆ సంస్థ కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ కూడా ఇంతకు మందు మాట్లాడినప్పుడు.. ఈ విషయం ఖరారయ్యాక మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా విశాఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. వైజాగ్‌లో జరిగిన ఓ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడిన ఆయన.. “గూగుల్ డేటా సెంటర్ వైజాగ్‌కు రాబోతోంది” అని చెప్పారు. తానే స్వయంగా వారికి స్థలం కూడా చూపానన్నారు. ఇది కార్యరూపం దాల్చితే. ఇండియాలో గూగుల్ ఒకేసారి పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే అవుతుంది.
గూగుల్ ఏషియాలో నిర్మిస్తున్న బిగ్గెస్ట్ డేటా సెంటర్..
విశాఖకు రాబోయే డేటా సెంటర్ ఇండియాకే ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఎందుకంటే వైజాగ్‌లో నిర్మించేది గూగుల్ ఏషియాలో నిర్మాణం చేస్తున్న అతిపెద్ద సెంటర్. 1 గిగావాట్ సామర్థ్యంతో… 6బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్..వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుక గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్ల విస్తరణ చేపట్టబోతున్నట్లు గూగుల్ తన కోర్ ప్రణాళికలో పేర్కొంది. డేటా సెంటర్ల నిర్మాణంపై 75బిలియన్ డాలర్లు ( దాదాపు 6లక్షల కోట్లు) ఖర్చు చేయాలన్న తమ నిర్ణయానికి ఇంకా తాము కట్టుబడే ఉన్నామని గూగుల్ ఈ ఏప్రిల్‌లో మరోసారి స్పష్టం చేసింది. దీనిని బట్టి చూస్తే గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటుపై చాలా కచ్చితమైన నిర్ణయంతో ఉన్నట్లు అర్థమవుతోంది. వైజాగ్ డేటా సెంటర్‌లో 2బిలియన్ డాలర్లను పునరుత్పాదక ఇంధనం (Renewable energy) ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకే వినియోగించనుంది...
గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి..?
మన ఇంటర్నెట్ నిరంతరాయంగా పనిచేయాలంటే డేటా సెంటర్లు కీలకం. అది లేకపోతే సేవలన్నీ నిలిచిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా మన డివైస్‌లలో ఉండే పెటా బైట్లు, జిటా బైట్ల కొద్దీ డేటాను మానేజ్ చేసేది ఇలాంటి డేటా సెంటర్లే. మన ఇంటర్నెట్ వ్యవస్థకే గుండెకాయ లాంటిది డేటాసెంటర్. గూగుల్ అయినా.. మరో సంస్థది అయినా డేటా మొత్తం అక్కడే నిల్వ చేస్తారు. మనం Youtubeలో ఏదైనా వీడియోను ఓపెన్ చేసినా.. Google Photos క్లౌడ్ డేటా నుంచి ఫోటోలు డౌన్ లోడ్ చేసినా.. మన Gmail ఉపయోగించా మొత్తం బ్యాక్ ఎండ్ అంతా అక్కడే జరుగుతుంది. డేటా సెంటర్ అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే.. మన డేటాను నిర్వహించి, భద్రపరిచే ప్రదేశం. ఇంత పెద్ద ఎత్తున డేటాను బ్యాకప్ చేయాలంటే చాలా స్థలం అవసరం అవుతుంది. వైజాగ్‌లో సముద్ర తీరంలో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు.
Google Data Center ఏముంటాయేంటే:
- లక్షల సంఖ్యలో సర్వర్లు ఉంటాయి. వీటి మీదే Youtube, Gmail, Google Photos పనిచేస్తాయి.
- డేటా స్టోరేజ్ వ్యవస్థ కూడా ఉంటుంది. గూగుల్ ప్రొడక్ట్స్‌లోని వీడియో, డాక్యుమెంట్ డేటా అంతా ఈ క్లౌడ్ స్టోరేజ్‌లో నిక్షిప్తం అవుతుంది
- హై స్పీడ్ నెట్‌వర్కింగ్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది.
- ఇంటర్నెట్ సర్వర్లు, క్లౌడ్ బ్యాకప్‌లు వేడెక్కకుండా పనిచేయడానికి కూలింగ్ వ్యవస్థ అవసరం అవుతుంది. ఆ ఏర్పాట్లు ఉంటాయి.
- ఈ వ్యవస్థ మొత్తం నిరంతరాయంగా పనిచేయడానికి డ్యూయల్ పవర్ లైన్లు,జనరేటర్ బ్యాకప్, సోలార్ యుపీఎస్ వంటివి అవసరం. దీనిని సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ తానే స్వయంగా 2బిలియన్ డాలర్లతో సొంత రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.

విశాఖ అనుకూలత ఏంటి..?
దేశాల మధ్య ఇంటర్నెట్ వ్యవస్థ అండర్‌గ్రౌండ్ సీ కేబుల్స్ ద్వారా పనిచేస్తుంది. సముద్ర తీర నగరాల్లో వీటిని అనుసంధానించేందుకు కేబుల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇండియాలో అత్యధిక కెపాసిటీ ఉన్న కేబుల్ స్టేషన్లు విశాఖలో ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అనేక సంస్థలు విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ఇప్పటికే అక్కడ ఓ ఎకోసిస్టమ్ ఏర్పాటైంది. కాబట్టి గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి సానుకూలంగానే స్పందించవచ్చు.
గురువారం విశాఖలో జరిగిన పర్యటనలో చంద్రబాబు కూడా తాము విశాఖలో సీ కేబులింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు సంస్థలు అక్కడ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ,





















