(Source: ECI/ABP News/ABP Majha)
Organ Donation: తాను చనిపోతూ, ఐదుగురికి ప్రాణదానం చేసిన శ్రీకాకుళం యువతి
Srikakulam News In Telugu: తాను చనిపోతూ అవయవదానం ద్వారా మరో అయిదుగురుకి ప్రాణదానం చేసింది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి.
Etcherla VRO Brain Dead: ఎచ్చెర్ల: తాను చనిపోతూ అవయవదానం ద్వారా మరో అయిదుగురుకి ప్రాణదానం చేసింది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి (Srikakulam Lady Organ Donation). అనుకోని ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక అవయవ దానానికి (Woman Organ Donation) కుటుంబ సభ్యులు ముందుకు వచ్చిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. గ్రీన్ చానల్ ను ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మౌనిక ఆర్గాన్స్ ను తరలించే కార్యక్రమం జిల్లాలో ఆదివారం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్త పేట గ్రామానికి చెందిన బొడిగి మౌనిక. శ్రీకాకుళం నగరంలోని రైతుబజార్ కు సమీపంలో ఉన్న సచివాలయంలో వి.ఆర్.వో గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 22వ తేదీన శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ కూడలికి సమీపంలోని వినాయక ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీఆర్వో మౌనిక తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారి కుటుంబీకులకు సమాచారం అందించడంతో పాటు.. వైద్య చికిత్స అందేలా చేశారు. తొలుత శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో, తదుపరి శ్రీకాకుళం మేడికవర్ ఆసుపత్రి, అనంతరం విశాఖపట్నం లోని అపోలో ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినప్పటికీ అప్పటికే మౌనిక బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు మౌనిక పరిస్థితిని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ క్రమంలో విశాఖ నుంచి తిరిగి శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో మౌనికను చేర్పించారు. ఈ సమయంలో జెమ్స్ ఆసుపత్రి సిబ్బంది మౌనిక పరిస్థితిని మరోసారి ఆమె కుటుంబానికి తెలియజేసి.. అవయవధానం చేసే అవకాశంపై వారికి వివరించారు. మరికొందరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని చెప్పగా అందుకు మౌనిక కుటుంబసభ్యులు అంగీకరించారు.
ఓ వైపు తమ కుటుంబంలో విషాదం జరిగినా.. తమ కలల సౌధం కదలలేక మృత్యువుకు చేరువ అవుతున్న సమయంలోనూ వీఆర్వో కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. తమ కుమార్తె మరణించినా.. మరో అయిదుగురుకి ప్రాణం ఇచ్చే అవకాశం ఉందని తెలుసుకుని మౌనిక అవయవాలను దానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మౌనిక తల్లితండ్రులు అంగీకారం తెలపడంతో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలను తరలించేందుకు ఆదివారం నాడు శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి నుండి గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుని కొన్ని గంటల లోనే మౌనిక అవయవాలను తరలించారు. మౌనిక గుండెను విశాఖపట్నం వరకూ రోడ్డు మార్గం గుండా తరలించి.. అక్కడి నుండి వాయు మార్గం ద్వారా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి చేర్చారు. అదేవిధంగా ఒక మూత్ర పిండంను విశాఖపట్నం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి, మరొకటి శ్రీకాకుళం జెమ్స్ లోని మరో రోగికి, రెండు కళ్ళను రెడ్ క్రాస్ కు అందించారు.
విషాద సమయంలోనూ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న మౌనిక తల్లితండ్రులను అందరూ అభినందిస్తున్నారు. ప్రమాదవశాత్తూ కూతురు ప్రాణం పోయినా మరో అయిదుగురికి అవయవదానం చేయడం గొప్ప పని అంటూ మౌనికకు కన్నీటి వీడ్కోలు తెలుపుతున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply