CM Jagan: సెప్టెంబరులోపు పిల్లలకి ఫ్రీగా ట్యాబ్‌లు, అమ్మఒడి అందుకే కొందరికి రాలేదు: సీఎం జగన్
Amma Vodi Scheme: మూడో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఈసారి శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించారు. ఈ మూడో విడతలో భాగంగా రూ.6,595 కోట్లు జమ చేస్తున్నట్లు వెల్లడించారు.
CM Jagan Speech: అర్హులైన విద్యార్థినీ విద్యార్థులకు వచ్చే సెప్టెంబరులోపు ట్యాబ్ లను అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులకు చదువే నిజమైన ఆస్తి అని, మన తలరాతను మార్చగలిగే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని అన్నారు. తమ ప్రభుత్వం చదువుపై పెడుతున్న ప్రతి రూపాయి కూడా విద్యార్థుల తలరాతలు మారుస్తుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి పథకం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఈసారి శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించారు.
ఈ మూడో విడతలో భాగంగా రూ.6,595 కోట్లు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ డబ్బు మొత్తం అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుందని వెల్లడించారు. మొత్తం 80 లక్షలకు పైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని, 40 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని చెప్పారు.
Also Read: సీఎం జగన్ పర్యటనతో శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు, సార్ ఇవి కూడా పట్టించుకోండి !
తాను చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశానని, అందుకే అధికారంలోకి వచ్చాక తాను ఎన్నికల ముందు ఇచ్చిన అమ్మ ఒడి పథకం సహా మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం తమ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుందని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే, అమ్మఒడి నిధులు సక్రమంగా వినియోగం అవ్వాలనే ఉద్దేశంతోనే 75 శాతం హాజరు నిబంధన తీసుకొచ్చామని వివరించారు. అందుకే ఈసారి కొంత మందికి అమ్మఒడి వర్తించలేదని చెప్పారు.
దుష్టచతుష్టయంతో జగన్ యుద్ధం
చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దిగువ స్థాయి ఉద్యోగులకు 8 నెలల పాటు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొని ఉందని విమర్శించారు. పిల్లల పోషణ పథకానికి కనీసం 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. అలాంటిది తమ ప్రభుత్వం వైఎస్సార్ పోషణం కింద రూ.5 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ‘‘ఇప్పుడు చంద్రబాబు అనుకూల మీడియా, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తో జగన్ ఒక్కడే పోరాడుతున్నాడు. నాకు మీరంతా అండగా ఉండాలి. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.