అన్వేషించండి
Advertisement
CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్ పెడతారట!
ఇప్పటికీ ఎమ్మెల్యే పనితీరుపై సీఎం వద్ద ఒకటికి రెండు నివేదికలు ఉన్నాయని చెబుతున్నారు. జనంతో మమేకం కాని, పని చెయ్యని ఎమ్మెల్యేలకు మరోసారి సీటు ఇచ్చేది లేదని చెబుతున్నారు ముఖ్యమంత్రి.
ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరు... ఇదే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మీద సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తున్న ప్రధాన విమర్శ. కేబినెట్ మీటింగ్ సమయంలో తప్ప కొందరు మంత్రులకు సైతం జగన్ అపాయింట్‌మెంట్ అంత సులభం కాదని సచివాలయంలో కూడా చెవుళ్లు కొరుక్కునే ఘటనలు అనేకం. ప్రభుత్వంలో, పార్టీలో ఒక హైరార్కీ వ్యవస్థ ఉన్నప్ప్పుడు అందరూ దాన్ని ఫాలో కావాలనేది జగన్ అభిమతం అనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే మధ్యస్థాయి లీడర్లకు, నాయకులకూ కూడా విలువ దక్కేలా ఉండడానికి ఓ పద్దతిని జగన్ ఫాలో అవుతున్నారని వారి సమాధానం.
పార్టీ పెద్దల వివరణ ఎలా ఉన్నా సరే తమ అధినేత ఎప్పుడూ తమకు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు పార్టీ శ్రేణులు. వాళ్లు నిరాశ చెందడంలో తప్పు లేదు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలు కానున్న వేళ.. ఇలాంటి అసంతృప్తులు, విమర్శలకు చెక్ పెట్టేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కింద స్థాయి కార్యకర్తలూ, ప్రభుత్వ వర్గాలకూ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని వినికిడి. దాని కోసం వచ్చే 15 రోజుల్లో జరుగనున్న వైసిపీ ప్లీనరీ వేదికగా కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్లీనరీ వేదికగా కొత్త కమిటీల ప్రకటన :
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన సాధారణ కార్యకర్తలకూ, క్షేత్రస్థాయి నాయకులకూ అందుబాటులో లేరనే విమర్శ గట్టిగానే ఉంది. ఏవైనా బహిరంగ సభలు జరిగినప్పుడు అక్కడి నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడడం తప్ప, మామూలు కార్యకర్తలు ఆయన్ని కలుసుకునే అవకాశం చాలా తక్కువ. ఇక మంత్రుల పరిస్థితీ అంతే అంటారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిదే ప్రధాన పాత్ర అని ప్రతిపక్షాలు కూడా బహిరంగ విమర్శలు చేస్తున్నాయి. వీరిలో సజ్జల రామకృష్ణా రెడ్డి అయితే ప్రభుత్వ సలహాదారుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ సీఎం వరకూ తీసుకెళ్లాల్సిన విషయాలు ఏవైనా ఉంటే అవి సజ్జల ద్వారానే తీసుకెళ్తారనే ప్రచారం ఉంది. విపక్షాలు సైతం ఆయనో షాడో సీఎం అంటూ విమర్శలు గుప్పించాయి.
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవుతున్న టైంలో ఈ పద్దతిని మార్చాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై సాధారణ ప్రజలు గానీ, కార్యకర్తలు గానీ తనను డైరెక్ట్‌గా కలిసేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. అందు కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. ప్రతీ అసెంబ్లీ స్థాయిలోనూ ఈ కమిటీలను వెయ్యడం ద్వారా తనను కలవాలనుకునే వారికి వెసులుబాటు కలిగించి, రోజులో ఎంతో కొంత సమయం కేటాయించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో జరగబోయే ప్లీనరీలో ప్రకటించబోతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసింది ఇదే :
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో పాటించిన పద్దతి ఇదే. రచ్చబండ పేరుతో తానే జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చెయ్యడం,లేదా రోజూ ఉదయమే ఒక గంటపాటు ప్రజలు తనను స్వయంగా కలిసే అవకాశం కలిగించడం ఇలా రకరకాల కార్యక్రమాలతో తనకూ, ప్రజలకూ గ్యాప్ లేకుండా చూసుకునే వారు. అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో వెనుకబడే ఉన్నారనే విమర్శ ఉంది. గతంలో రచ్చబండ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తారని ప్రచారం జరిగినా ఎందుకనో అనుకున్న విధంగా దానిని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఇప్పుడు ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి, ప్రజలతో ఎలాంటి గ్యాప్ లేకుండా చేసుకోవడానికి వీలుగా కొత్త కార్యాచరణను ఆయన రూపొందించారని , ప్లీనరీలోనే వాటిని ప్రకటిస్తారని తెలుస్తోంది.
సిటింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ :
ఇప్పటికీ ఎమ్మెల్యే పనితీరుపై సీఎం వద్ద ఒకటికి రెండు నివేదికలు ఉన్నాయని చెబుతున్నారు. జనంతో మమేకం కాని, పని చెయ్యని ఎమ్మెల్యేలకు మరోసారి సీటు ఇచ్చేది లేదని చెబుతున్నారు ముఖ్యమంత్రి. ఇప్పడు ప్రజల నుంచి కూడా డైరెక్ట్‌గా ఎమ్మెల్యేల పని తీరుపై వివరాలు తెలుసుకునే యాక్షన్ ప్లాన్‌కూ ఆయన సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పని చెయ్యని ఎమ్మెల్యేలలో కలవరం మొదలైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరి సీఎం ఆలోచనలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion