ఇల్లే అక్వేరియం- ఫిరానా నుంచి ప్రపంచంలోని చాలా రకాల చేపలకు నిలయం
అమెజాన్‌లోని ఫిరానా నుంచి మొసలి మొఖం చేపల వరకూ ఒకేచోట కనిపిస్తే ఎలా ఉంటుంంది. అలాంటిది వైజాగ్‌లో సముద్రం పక్కనే ఉందంటే నమ్మగలారా?
సాధారణంగా ఇంట్లో ఉండే ఆక్వేరియం మీరు చూసి ఉంటారు. అలాంటిది ఇంటి మొత్తాన్నే అక్వేరియంగా మార్చేస్తే అదే మత్స్యదర్శిని. విశాఖ నగరం అంటేనే టూరిస్ట్ స్పాట్‌లకు పెట్టింది పేరు. అలాంటి ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ఆర్కే బీచ్ లోని మత్స్యదర్శిని. పిల్లలకూ, పెద్దలకూ వినోదంతోపాటు విజ్ఞానాన్ని కలిగించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. జల జీవరాసులపై అవగాహన పెంచడానికి పెట్టిందే ఈ మత్స్యదర్శిని. ఎక్కడో అమెజాన్ అడవుల్లో ఉండే ఫిరానా చేపల నుంచి, చూడగానే మొసలిని తలపించే ఆలిగేటర్ ఫిష్ వరకూ విభిన్న రకాల చేపలూ,ఇతర జలచరాలు మత్స్యదర్శినిలో మీకు ఆహ్వానం పలుకుతాయి .
ఆర్కే బీచ్ ఎదురుగానే ఆహ్వానం పలికే మత్స్యదర్శిని :
వైజాగ్‌లోని రామకృష్ణ బీచ్ తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ బీచ్‌కు సరిగ్గా ఎదురుగా ఉండే బిల్డింగే మత్స్యదర్శిని. చూడగానే ఆకర్షించేలా ఈ భవంతి ఉంటుంది. అందులో అనేక విభాగాల్లో చాలా రకాల చేపలు అక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్వానం పలుకుతాయి. ముఖ్యంగా పిల్లలకైతే ఇన్ని రకాల చేపలను ఒకేచోట చూడడం నిజంగా సంబరమే అనే చెప్పాలి. ఇక పెద్దలకు కూడా స్ట్రెస్ బస్టర్‌గా ఈ అక్వేరియం పని చేస్తుంది. అక్వేరియంలలోని నీళ్ళలో ప్రశాంతంగా ఈదుతున్న రకరకాల చేపలను చూస్తుంటే మనసు మైమరచిపోవడం ఖాయం .
మరో లోకంలోకి వెళ్లిన ఫీలింగ్ :
ఆ మత్స్యదర్శినిని ఎంత బాగా డిజైన్ చేసారంటే ఒక్కసారి లోపలికి అడుగు పెట్టగానే ఏదో మరో లోకంలోకి ఎంటర్ అయ్యామేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకప్పుడు అంటే 1990 వరకూ ఈ మున్సిపల్ కమిషనర్ బంగ్లా వద్ద ఈ మత్స్యదర్శిని ఉండేది. అయితే అందరికీ అందుబాటులో ఉండేలా దీన్ని బీచ్‌లో కొత్త బిల్డింగ్ నిర్మించి అందులోకి మార్చి లీజుకు ఇచ్చారు. దీని ఎంట్రీ టికెట్ కూడా చవకగానే ఉంటుంది. పిల్లలకు 20 రూపాయలు, పెద్దవాళ్లకు 60 రూపాయలు. అయితేనేం ఈ మత్స్యదర్శిని లోపలికి వెళ్ళగానే అక్కడి చేపలూ, తాబేళ్లు కలిగించే ఆహ్లాదం, పంచే విజ్ఞానం ముందు అదేమంత పెద్ద ధర కాదు అనిపిస్తుంది.
నిజానికి ఇన్ని అక్వేరియంలను ఒకేచోట ఉంచడం వాటిని రోజూ మెయింటైన్ చెయ్యడం, ప్రతీరోజూ వాటిలోని నీటిని మార్చడం అనేది పెద్ద ప్రయాసే. అయినప్పటికీ నిర్వాహకులు ఈ మత్స్యదర్శనిని సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ తెరచి ఉంచే ఈ మత్స్యదర్శినిని వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన డెస్టినేషన్‌లలో ఒకటిగా మార్చుకోవడం మరవకండి.