Atchannaidu: హోం మంత్రి ఎవరో వైసీపీ ఎమ్మెల్యేలకు తెలియదు- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
Tahsildar murdered in Visakhapatnam: విశాఖ జిల్లా కొమ్మాదిలో తహశీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గం అని, ఈ ఘటన ఏపీలో శాంతి భద్రతలకు అద్దం పడుతోందన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు.
Atchannaidu Respond on Tehsildar murder: విశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్ కి తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై లేకపోవటం సిగ్గుచేటు అంటూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో తహశీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గం అని, ఈ ఘటన ఏపీలో శాంతి భద్రతలకు అద్దం పడుతోందన్నారు. మండల మేజిస్ట్రేట్ నే ఇంట్లోకి వెళ్లి హత్య చేశారంటే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ప్రశాంతతకు నిలయమైన ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంసృతి లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం అమలవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ఐదేళ్ల నుంచి విశాఖను భూకజ్జాలు, ప్రజల ఆస్తుల విధ్వంసం, కమీషన్లు, సెటిల్ మెంట్లకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. ప్రజలు, అధికారులపై బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, శిరోముండనాలు వైసీపీ పాలనలో నిత్యం ఏదోచోట జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం పనిచేస్తూ వైసీపీ నేతల అవినీతి, అరాచకాలకు అడ్డుతగిలిన అధికారులపై వేధింపులు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాజాగా తహసీల్దార్ రమణయ్యను హత్య చేశారు, గతంలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మార్వో లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ నేత చెంచు రెడ్డి ఎమ్మార్వో ఆఫీసులో బహిరంగంగా దాడి చేశాడని గుర్తుచేశారు.
హోంమంత్రి ఎవరో వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి తెలియదు
జగన్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరిపై దాడులు జరుగుతాయో, ఎప్పుడు ఎవరు హత్యకు గురవుతారోనని ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు నేరాలు జరుగుతుంటే హోమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అసలు హోంమంత్రి ఎవరో వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల్ని జగన్ ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, ప్రతిపక్ష నేతలను వేధించడానికే ఉపయోగిస్తున్నారు తప్ప శాంతి భధ్రతల రక్షణ కోసం కాదన్నారు. తహసీల్దార్ రమణయ్య హత్యపై వెంటనే విచారణ చేపట్టి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కార్ ను సాగనంపేందుకు అధికారులు, ప్రజలు సిద్దంగా ఉన్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నిరు.
‘మంత్రుల నుంచి వాలంటీర్ల వరకు అధికారులపై దాడులు, బూతులతో విరుచుకుపడుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అవినీతికి సహకరించలేదన్న కారణంతో దళిత కలెక్టర్ గంధం చంద్రుడిపై దౌర్జన్యం చేయటమేకాక, బదిలీ చేయించాడు. గుడివాడలో భూకబ్జాను అడ్డుకున్న వీఆర్వోను జేసీబీతో తొక్కి చంపేందుకు కొడాలి నాని అనుచరులు యత్నించారు. శాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి శాఫ్ అధికారులను మీటింగ్ లో అహంకారపూరితంగా ఇష్టమెచ్చినట్టు మాట్లాడి వారిని అగౌరవపరిచారు. కార్ పార్కింగ్ విషయంలో మాజీ మంత్రి పేర్నినాని పోలీసులను బండబూతులు తిట్టాడు. ప్రకాశం జిల్లాలో విద్యుత్ ఉద్యోగిపై వైసీపీ నాయకులు బహిరంగంగా దాడి చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులపై వైసీపీ నాయకులు, వాలంటీర్ల దాడులు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయని’ అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
హత్యను ఖండించిన అసోసియేషన్
తహసీల్దార్ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. రమణయ్య కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. హత్యకు కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని అసోసియేషన్ నాయకులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు రమణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.