Sharmila Tour: నేటి నుంచి పీసీసీ ప్రెసిండెంట్ షర్మిల జిల్లాల పర్యటన
AP PCC Chief Sharmila Tour: క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై పీసీసీ ప్రెసిండెంట్ షర్మిల దృష్టి సారించారు. జిల్లాలు వారీగా పర్యటించినున్నారు.
PCC Chief Sharmila Tour : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆమె జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి(జనవరి 23) నుంచి జిల్లాలు వారీగా ఆమె పర్యటించి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ఇచ్చాఫురం నుంచి ఇడుపులపాయ వరకు షర్మిల పర్యటన సాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు. ఈ నెల 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, 25న కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో, 27న కృష్ణ, గుంటూరు, పల్నాడు,, 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు. ఈ నెల 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో, 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, 31న నంద్యాల, వైఎస్‌ఆర్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు.
కీలక నేతలు చేరేలా
షర్మిల జిల్లాలు వారీగా పర్యటిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలు వారీగా పార్టీ నాయకుల గురించి తెలుసుకోవడంతోపాటు పార్టీ బలాబలాలపై ఒక అంచనాకు వచ్చేందుకు షర్మిలకు ఈ పర్యటన అవకాశాన్ని కల్పించనుంది. అదే సమయంలో షర్మిల జిల్లాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించే సమయంలోనే కొత్తగా పార్టీలో చేరే వారిపై కేడర్‌కు సమాచారాన్ని ఇవ్వనున్నారు. కొత్తగా పార్టీలో చేరే నాయకులతో కలిసి పని చేసుకునేలా ఇప్పటి వరకు పని చేస్తునన నాయకులకు ఆమె సూచించనున్నారు. ప్రతి జిల్లాల్లోనూ కనీసం పది మందికిపైగా కీలక నాయకులు వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి చేరే అవకాశముంది. ఇదే విషయాన్న పార్టీ శ్రేణులకు సమీక్ష సందర్భంగా షర్మిల చెబుతారని భావిస్తున్నారు.
ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభం..
పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి పోరు విశాఖ నగరంలోనే సాగించారు. రాహుల్ గాంధీ యాత్రపై దాడికి నిరసనగా సోమవారం సాయంత్రం నిరసన కార్యక్రమాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టారు. ఇప్పుడు ప్రారంభిస్తున్న జిల్లాల పర్యటన కూడా ఉత్తరాంధ్ర నుంచే షర్మిల ప్రారంభిస్తున్నారు. గతంలో ఆమె చేపట్టిన పాదయాత్రను శ్రీకాకుళంలోనే ముగించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్న షర్మిల శ్రీకాకుళం నుంచి తన పర్యటనను ప్రారంభిస్తుండడం గమనార్హం. ఏది ఏమైనా షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు.