Visakha Ysrcp : సాగరతీర నగరంలో భూ ఆరోపణలు, అధికార పార్టీ ఎంపీల మధ్య కోల్డ్ వార్!
Visakha Ysrcp : విశాఖలో అధికార పార్టీ ఎంపీల మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. భూవివాదాల్లో ఒకరి వర్గం మరో వర్గం పరోక్షంగా ఆరోపణలు చేసుకుంటున్నారు.
Visakha Ysrcp : విశాఖ నగరాన్ని ఏపీ పాలనా రాజధానిగా చెయ్యాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే అదే సమయంలో ఆ ప్రాంతంలోని ఇద్దరి ఎంపీల మధ్య మొదలైన ఈగో వార్ వైజాగ్ లో పార్టీని దెబ్బతీస్తుందని భావిస్తున్నాయి పార్టీ శ్రేణులు. రోజురోజుకీ ఇద్దరి మధ్య జరుగుతున్న రియల్ ఎస్టేట్ వార్ ముదురుతూ పోతుందని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి . ఇటీవల వరకూ విశాఖ ఏరియా మొత్తాన్ని కనుసైగతో శాసించిన ఒక ఎంపీని ప్రస్తుతం విశాఖకు దూరం పెట్టింది పార్టీ. అంత వరకూ అదే ఏరియాకు చెందిన మరో ఎంపీతో అంతర్గతంగా ఎలాంటి విభేదాలు ఉన్నాయో గానీ అలా దూరమైన ఎంపీపై ఒక్కసారిగా దశాబ్దాల నాటి దసపల్లా భూములను కారు చవుకగా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం వెనుక ఉంది మరో ఎంపీ అంటూ వార్తలు గుప్పుమన్నాయి. సదరు నేత 30:70 రేషియోలో అంటే భూయజమానులకు 30 శాతం లాభం, డెవెలప్మెంట్ పేరుతో ఏకంగా 70 శాతం లబ్ది తాను, తన బినామీలు పొందేలా ప్లాన్ వేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు వ్యక్తి ఆ రెండో ఎంపీనే అని ప్రస్తుతం విశాఖ ప్రాంతానికి దూరంగా ఉంటున్న నేత వర్గం భావిస్తుంది.
సీన్ లోకి 1:99 ఇష్యు
దసపల్లా భూముల ఆరోపణలు అలా ఉండగానే, విశాఖ శివార్లలోని ఒక భూ సెటిల్మెంట్ లో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా భూ యజమానికి 1 శాతం, బిల్డర్ కు 99 శాతం అంటూ కుదిరిన ఒక ఒప్పందం వెలుగులోకి వచ్చింది. ఆ బిల్డర్ సదరు రెండో ఎంపీనే అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రెండు పార్టీలకు లేని అభ్యంతరం తప్పు ఎలా అవుతుందని ఆ రెండో ఎంపీ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై వివిధ వర్గాల నుంచి ఆయా రెండో ఎంపీపై ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. వీటి వెనుక ఉంది మొదటి ఎంపీనే అని రెండో ఎంపీ వర్గం భావిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వైరం మరింత ముదిరింది.
ఒకరిపై ఒకరు డైరెక్ట్ గా విమర్శలు చేసుకోరు కానీ
తమ మధ్య ఇంతటి వైరం ఉన్నా ఆ ఇద్దరు ఎంపీలూ ఒకరిపై ఒకరు డైరెక్ట్ గా ఆరోపణలు చేసుకోరు. అంతా ఇండైరెక్ట్ ఎటాక్ నే. ప్రస్తుతం ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం కూడా లేదు. ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు హాజరు కావడం లేదు. ప్రభుత్వం సపోర్ట్ తో విశాఖలో రాజధానికి అనుకూలంగా కార్యక్రమం పెడితే అంత ముఖ్యమైన దానికి కూడా ఒకరు హాజరు అయితే మరొకరు హాజరు కాలేదు.
ఆందోళనలో పార్టీ శ్రేణులు
సీఎం జగన్ ఇప్పటికే ఈ వ్యవహారంలో ఇద్దరినీ మందలించినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు పార్టీ శ్రేణులు మాత్రం ఎంపీల వైఖరితో ఆందోళనలో ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమ భావి రాజాధానిగా భావిస్తున్న విశాఖ ప్రాంతంలో కీలక నేతల మధ్య ఇలాంటి విభేదాలు పార్టీని నష్టపరుస్తాయని వారు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ ఇద్దరు ఎంపీలు కూడా విశాఖ ప్రాంతానికి స్థానికులు కాకపోవడం గమనార్హం.