Ramakrishna Mission : రామకృష్ణ మిషన్ @ 125 ఇయర్స్, ఈ ఏడాది మొత్తం ఉత్సవాలు
Ramakrishna Mission 125 Years : స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్ 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రామకృష్ణ మిషన్ ప్రతినిధులు తెలిపారు.
Ramakrishna Mission 125 Years : ప్రజల్లో సామాజిక సేవ, ఆధ్యాత్మిక భావన, క్రమశిక్షణను జాగృతం చెయ్యడానికి కృషి చేసిన స్వామి వివేకానంద బోధనలు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన సంస్థ రామకృష్ణ మిషన్. ఈ సంస్థ ఏర్పడి సరిగ్గా 125 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ ఏడాది మొత్తం ఉత్సవాలు జరపాలని రామకృష్ణ ఆశ్రమం, రామకృష్ణ మిషన్ నిర్వాహకులు నిర్ణయించారు. 1897లో రామకృష్ణ మిషన్ ను ఏర్పాటు చేశారు స్వామి వివేకానంద. తన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస బోధనలు, తన ఆశయాలను సాధనకు ఏర్పాటు చేసిన ఈ మిషన్ కు తన గురువు పేరే పెట్టి గురుభక్తిని చాటుకున్నారు స్వామి వివేకానంద. అమెరికా పర్యటన ముగించుకుని భారతదేశం తిరిగొచ్చిన స్వామి వివేకానంద ఇక్కడి ప్రజల్లో నెలకొంటున్న అలసత్వం, క్రమశిక్షణారాహిత్యాన్ని గమనించి వారి కోసం ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో రామకృష్ణ మిషన్ ను స్థాపించారు. అంతకుముందు నాలుగేళ్లపాటు దేశ వ్యాప్తంగా పర్యటించిన స్వామి వివేకానంద భారతీయుల్లో ఉన్న దేశభక్తి, సామర్ధ్యాలను గుర్తించారు. వాటిని జాగృతం చేసేలా రామకృష్ణ మిషన్ ను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా 275 రామకృష్ణ మిషన్ ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో సన్యాసం స్వీకరించిన శిష్యులు, గురువులు కలిపి 2 వేల మంది వరకూ ఉన్నారు. వీరిలో 100 మంది ఆశ్రమాల నిర్వహణ భాగమయ్యాయి. వెయ్యి మంది ధ్యానం, సమాజసేవ, యువతకు ఆధ్యాత్మిక అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
రామకృష్ణ మిషన్ లో రెండు భాగాలు
రామకృష్ణ మిషన్ లో రెండు కీలక భాగాలు ఉంటాయి. 1897 మే ఒకటో తారీఖున కోల్ కతాలోని బలరాం సమావేశ మందిరంలో రామకృష్ణ మిషన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద దాన్ని రెండుగా విభజించారు. అందులో మొదటిది రామకృష్ణ మఠం. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, పుస్తకాల ప్రింటింగ్, భక్తులకు శిక్షణ వంటి అంశాలకు పరిమితం అయింది. రెండోది రామకృష్ణ ఆశ్రమ మిషన్. ఇది పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం ఉద్దేశించినది. స్కూల్స్, ఆసుపత్రుల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలను ఈ మిషన్ ద్వారా చేపట్టాలని ఆయన సూచించారు. ఈ నూట పాతికేళ్లలో ఆయన సూచనల ఆధారంగానే ఈ రెండూ పనిచేస్తున్నాయంటారు రామకృష్ణ ఆశ్రమ ప్రధాన స్వామిజీ బోధమయానంద.
(స్వామిజీ బోధమయానంద)
అమెరికా స్పీచ్ కన్నా ముందే హైదరాబాద్ లో స్వామి వివేకానంద ప్రసంగం
అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద ఇచ్చిన ప్రసంగమే తొలిప్రసంగం అనుకుంటారు చాలామంది. కానీ అది పొరబాటు. దానికంరే ముందుగానే 1893 ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో స్వామి వివేకానంద తొలి ప్రసంగం ఇచ్చారు. నిజాం నవాబును సైతం ఆయన కలిశారు. ఆ సందర్భంలో మై మిషన్ టు వెస్ట్ అనే అంశంపై మెహబూబ్ కాలేజ్ లో ఇచ్చిన ప్రసంగం ఎందరినో ఉత్తేజపరిచింది. ఆయన అమెరికా నుంచి వచ్చిన తరువాత తనను కలిసిన వారితో మరో 50 ఏళ్లలో భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని అయితే ముందు అందరూ మనుషుల్ని మనుషులుగా చూడాలని చెప్పారు వివేకానంద. అటువంటి మహోద్దేశంతో ఏర్పడిందే రామకృష్ణ మిషన్. అందుకే ఇక్కడ జరిగే కార్యక్రమాలు నేటికీ ఎందరో యువతీ యువకుల్ని ఆకర్షిస్తుంటాయి.
వైజాగ్ లో రామకృష్ణ మఠం
కోల్ కతాలోని రామకృష్ణ ఆశ్రమం తరువాత వైజాగ్ లోని ఆశ్రమం కూడా చాలా ప్రాముఖ్యమైంది. రామకృష్ణ పరమహంసకు స్వయంగా శిష్యుడైన స్వామి శివానంద 1924 లో వైజాగ్ సందర్శించి కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడ కూడా ఒక రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉండాలని ప్రస్తుతం ఉన్న RK మఠాన్ని ఏర్పాటు చేశారు. తరువాతికాలంలో బీచ్ ను రామకృష్ణ బీచ్ అని పిలవటం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా మిగిలిన అన్ని ఆశ్రమాలలాగే ఉదయం నుండి పూజా కార్యక్రమాలు ఒకవైపు, లైబ్రరీ నిర్వహణ, యోగా, సంస్కృత భాషా శిక్షణ వంటివి మరోవైపు నిర్వహిస్తారు.
రామకృష్ణ మ్యూజియం
రామకృష్ణ పరమహంస మ్యూజియం చాలా ముఖ్యమైంది. అన్ని మతాలూ ఒకటే అనీ అందరి మనుషులూ సమానం అంటూ చాటి చెప్పేలా అనేక పుస్తకాలు, మినియేచర్ లతో రామకృష్ణ పరమహంస జీవిత ఘట్టాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, యువకుల కోసం ప్రత్యేకమైన పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. ఇక రామకృష్ణ మిషన్ ఏర్పడి 125 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది అంతా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టనుంది రామకృష్ణ ఆశ్రమం. మే 2 నుంచి 16 వరకు బాల వికాస్ సమ్మర్ క్యాంప్, యువతకు మే నుంచి నాలుగు నెలల పాటు స్వయం సేవపై శిక్షణ, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు రిటైర్డ్ ఐఏయస్ అధికారులు, సీఏలతో " నా భారతం-అమర భారతం " సలహాలు, ఇతర భాషలు నేర్చుకునేవారికోసం ఆఫ్ లైన్ /ఆన్లైన్ పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. మెదడు సంబంధిత వ్యాధులు, సమస్యలతో బాధ పడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా క్లినిక్ , గిరిజన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. అలాగే యువ సంఘర్ష్ పేరుతో ఎస్సే రైటింగ్, వక్తృత్వ పోటీలు, క్విజ్ ప్రోగ్రామ్స్ ,లీడర్ షిప్ ట్రైనింగ్ వంటివి నిర్వహించనున్నట్టు రామకృష్ణ ఆశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. మే నెల మొదలుకొని ఈ ఏడాది అంతా రామకృష్ణ ఆశ్రమం 125 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఘనంగా చేస్తుంది రామకృష్ణ మిషన్ .