Minister Gudivada Amarnath : ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు బాదుడే బాదుడు, అందుకే పవన్ కు కన్నుకొడుతున్నారు : మంత్రి గుడివాడ అమర్ నాథ్
Minister Gudivada Amarnath On Chandrababu : 2019 తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును బాదుడే బాదుడని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. చంద్రబాబును అమరావతి అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా అని ప్రశ్నిస్తున్నామన్నారు.
Minister Gudivada Amarnath On Chandrababu : విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా అని అడిగిన టీడీపీ అధినేత చంద్రబాబును అమరావతి అభివృద్ధి కావాలా? లేక రాజధాని కావాలా అని మేం అడుగుతున్నామని దీనికి ఆయన ఏం సమాధానం చెపుతారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. దేశంలో అత్యధికంగా డీబీటీ ద్వారా ఇవాళ్టికి దాదాపు 1.39 లక్షల కోట్లు, కేవలం 35 నెలల్లో పేదల చేతిలో పెట్టిన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక చివరికి దేశంలో కెల్లా అత్యధిక ధరలు, పన్నులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో స్కీములు లేవు డీబీటీలు లేవు. జన్మభూమి కమిటీల దోపిడి కింద స్థాయిలో జల యజ్ఞం దోపిడీ, రాజధాని పేరిట దోపిడీ, ఇసుక పేరిట దోపిడీ, మద్యం పేరిట దోపిడి పై స్థాయిలో ఉన్నాయన్నారు.
విశాఖపై కక్ష
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో బాబు తన 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్కటి అయినా అమలు చేశారా అని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. నవరత్నాలు అమలుచేయకపోయినా ఇంతే ఆదాయం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ డబ్బంతా ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ రోజు కాకపోతే రేపు ప్రజల అభీష్టం మేరకు, డీ సెంట్రలైజేషన్ ఖాయమని, విశాఖకు రాజధాని వెళ్తుందని మంత్రి అన్నారు. అమరావతిలో తన బినామీల భూములకు రేట్లు పెరగవన్న ఆందోళనతో చంద్రబాబు విశాఖపై కక్షగట్టారని ఆరోపించారు.
ఐరన్ లెగ్ చంద్రబాబే
చంద్రబాబు కంటే ఐరన్ లెగ్ తెలుగుదేశం పార్టీకి ఎవరుంటారని మంత్రి అన్నారు. తన కొడుకు ఐరన్ లెగ్–2 అని గమనించిన తరవాతే దత్త పుత్రుడి మీద నమ్మకం పెట్టుకున్నారన్నారు. తన మీద తనకు నమ్మకం లేకే పవన్ కల్యాణ్‌కు మళ్లీ కన్ను కొడుతున్నారన్నారు. చంద్రబాబు 44 ఏళ్ల రాజకీయంలో సీఎం పదవి పక్కాగా వచ్చిందా? లేక పక్క నుంచి వచ్చిందా అన్నది అందరికీ బాగా తెలుసన్నారు. బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి తన పేరు చెపితే ఒక్కటంటే ఒక్క మంచి పథకం అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. 2019 తరవాత కూడా ప్రతి ఎన్నికల్లో బాదుడే బాదుడు అని ప్రజలు చంద్రబాబును బాదేశారన్నారు. విశాఖను, ఉత్తరాంధ్రను దెబ్బతీసి అమరావతిలో బినామీ భూముల రేట్ల కోసం చేసే కుట్రలకు, కుతంత్రాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.