Pawan Kalyan : జనసేన నేతలను విడుదల చేసే వరకూ విశాఖలోనే ఉంటా- పవన్ కల్యాణ్
Pawan Kalyan : విశాఖలో ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమలు నిర్వహించొద్దని పోలీసులు పవన్ కల్యాణ్ కు నోటీసులు అందజేశారు. పోలీసుల నోటీసులపై పవన్ ఫైర్ అయ్యారు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ సిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్‌లో మీడియా సమక్షంలో విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర పవన్ కల్యాణ్ కు నోటీసులు అందజేశారు. విశాఖ నగరంలో పోలీస్ యాక్ట్, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 500 మందికిపైగా ర్యాలీలో పాల్గొన్నట్లు నోటీసుల్లో పోలీసులు తెలిపారు. అలాగే విశాఖ గర్జన ర్యాలీకి హాజరై తిరిగి వెళ్తోన్న మంత్రులు, స్థానికులు, పోలీసులపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలిపారు. స్థానికులు, పోలీసుల ఫిర్యాదుతో నోటీసులు అందజేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ వరకూ నగరంలో ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు అనుమతి లేదని తెలిపారు. అనుమతి లేకుండా జనసేన భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని పోలీసులు అన్నారు. జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలో భారీగా జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో మంత్రులు కార్లపై రాళ్ల దాడి జరిగినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో పలువురు జనసేన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా ఆంక్షలు విధించి నోటీసులు అందజేశారు.
జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం
పోలీసుల నోటీసులు తీసుకున్న అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. తాను విశాఖకు రాకముందే గొడవ జరిగిందన్నారు. తాము రెచ్చగొట్టడం వల్లే ఘటన జరిగినట్లుగా పోలీసులు నోటీసులిచ్చారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని పవన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామని డ్రోన్లు నిషేధించారని ఆరోపించారు. ప్రజల్లో మార్పు వచ్చే వరకు జనసేన పోరాడుతోందన్నారు. ప్రశ్నించేతత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయన్నారు.
విశాఖలోనే ఉంటా
"నేను నోటీసులు తీసుకున్నాను. ఋషికొండ దోపిడీని డ్రోన్ ద్వారా చూపిస్తామని డ్రోనులు నిషేధించారు. ఏ పార్టీ కూడా మరో పార్టీని ఎదగడానికి ఒప్పుకోదు. నేను జైలుకు వెళ్లడానికి సిద్ధం. ప్రశ్నించేతత్వం లేకపోతే దోపిడీ రాజ్యం ఉంటుంది. క్రిమినల్ పాలసీతో వైసీపీ పాలన సాగుతోంది. అరెస్ట్ చేసిన మా వాళ్లను వెంటనే విడుదల చెయ్యాలి. అప్పటి వరకూ విశాఖలో ఉంటాను. వందలాది మంది మా కార్యకర్తలను అరెస్టులు చేశారు. తెల్లవారు జామున 3 గంటల నుండి పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అరెస్టు చేసిన మా నాయకులు వచ్చే వరకు నేను వైజాగ్ లోనే ఉంటాను. అధికారం ఉన్నవాళ్లు గర్జించడం ఏంటి. చాలా మంది మా జనసేన నాయకులను జనవాణికు రాకుండా ముందస్తు హౌస్ అరెస్టలు చేశారు. పోలీసులు నేరస్తులకు కొమ్ముకాయకండి. అమాయకులను అరెస్టు చేస్తారా?". కోడి కత్తి కేసు అన్నది పెద్ద డ్రామా. దాడి సమయంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు పోలీసు బందోబస్తు లేదా? ఉంటే ఏమైనట్లు. వైఎస్ఆర్సీపీ నాయకులకు జనసేన అంటే భయం పట్టుకుంది. కోనసీమలో ఎలా ఉద్రిక్తత రెచ్చగొట్టారో ఇప్పుడు విశాఖలో అలాగే సృష్టించారు."- పవన్