MP GVL Narsimharao : ప్రధాని పర్యటనకు ముందే జోన్ పై నోటిఫికేషన్, రూ.106 కోట్లు మంజూరు - ఎంపీ జీవీఎల్
MP GVL Narsimharao : సోము వీర్రాజును టార్గెట్ చేసి కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
MP GVL Narsimharao : ప్రధాని మోదీ రెండు రోజుల విశాఖ పర్యటన విజయవంతం అయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. వ్యక్తిగతంగా తన అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిందన్నారు. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారానికి నిదర్శనమన్నారు. ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ ఉంటుందా లేదా అనే చర్చలు సాగాయని, ప్రధాని రాకకంటే ఒక రోజు ముందే ఈనెల 10న జోన్ ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ వెలువడిందన్నారు. రాయగడ డివిజన్, విశాఖ జోన్లకు రూ.106 కోట్లు మంజూరు చేశారన్నారు. కనుక దీని మీద విమర్శలు సరికాదన్నారు. రైల్వే మంత్రి జోన్ ప్రధానకార్యాలయం ఎక్కడ నిర్మించాలో చర్చించారని, నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందన్నారు.
సోము వీర్రాజును బలహీన పర్చేందుకు
"నేషనల్ ఇంటర్నెట్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా ఎనిమిది సెంటర్లలో ఒకటి విశాఖకు దక్కింది. ఇది నెట్ కల్పనకు అత్యవసరం. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ శాఖ చూస్తున్నారు. మరో మూడు నెలల్లో ఇది విశాఖలో సాకారం అవుతుంది. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఊపునిస్తుంది. ఇంటర్నెట్ సేవలు ఫాస్ట్ ట్రాక్ లో అందుతాయి. ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీ కోర్ కమిటీతో గంటన్నర చర్చించారు. అదే రాత్రి ప్రెస్ మీట్లో ఆ వివరాలు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. కోర్ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకు చెప్పం. కానీ కొన్ని మీడియాలు అక్కడ ఏదేదో జరిగిందని కొందర్ని టార్గెట్ చేస్తూ అసత్యాలు రాశారు. సోము వీర్రాజు గార్ని మీ పేరేమిటి అని అడిగారని రాశారు. ఇది వీర్రాజును బలహీన పరచటానికి బురద చల్లటానికి రాసిన రోత. మోదీ వద్దకు వెళ్లిన వారు మొదట సంప్రదాయం ప్రకారం తమ పేర్లు హోదాలు చెప్తారు. అంతకు ముందు ఎయిర్ పోర్టులో సోము వీర్రాజు స్వాగతం పలికి రోడ్ షోలో పాల్గొన్నారు కదా? సోమూజీ మీరు ఏం చేస్తుంటారు అని మోదీజీ అడిగితే 42 ఏళ్లుగా పార్టీకి అంకితం అయ్యానని వీర్రాజుగారు చెప్పారు. నా మాదిరిగానేనా! అని మోదీ వ్యాఖ్యానించారు. ఇంత మంచి అభినందన ఇక ఎవరికైనా లభిస్తుందా? " - ఎంపీ జీవీఎల్
కోర్ కమిటీలో ఆగ్రహంగా మాట్లాడలేదు
బీజేపీ కోర్ కమిటీలో ఎవరూ ఆగ్రహంగా మాటాడలేదని ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. అది తమ సంస్కృతి కాదన్నారు. చక్కని వాతావరణంలో కోర్ కమిటీ సభ్యుల్లో చాలా మంది తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. అక్కడ విమర్శలు చేసే స్థాయి ఎవరికీ లేదన్నారు. కొత్త ఒరవడితో ప్రజలకు సేవలందటమే లక్ష్యంగా పని చేయాలని ప్రధాని సూచించారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి దోహద పడేలా ప్రధాని యాత్ర సాగిందన్నారు. తమ శోభా యాత్ర మీద పోలీసులు అనేక ఆంక్షలు విధించినా విజయవంతం చేశామన్నారు.
Also Read : Pawan Kalyan : దెబ్బతిన్న పులి లాంటోడ్ని అవినీతి చేసేవాళ్ల అంతం చూస్తా- పవన్ కల్యాణ్