Vishnu Vardhan Reddy Counter : కేంద్రం గీంద్రం జాంతానై అన్న బయ్యారం డాంబికాలు ఏమయ్యాయ్- కేటీఆర్ కు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్
Vishnu Vardhan Reddy Counter : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడుతున్న కేటీఆర్ బయ్యారం ఉక్కు పరిశ్రమపై సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
Vishnu Vardhan Reddy Counter : వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇంతగా కంగారు పడుతున్న మంత్రి కేటీఆర్ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని సొంతంగా నిర్మిస్తామని పోయిన డాంబికాలు ఎటుపోయాయని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కోసం ఎనిమిదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందన్నారు. అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదని నిపుణులు తేలిస్తే.. కేసీఆర్ ఏమన్నారో తెలుసా కేటీఆర్ " కేంద్రం గీంద్రం జాంతానై .. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ జేపిచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తా’అని ప్రకటించారన్నారు. ఇలా ప్రకటించి ఎంత కాలమైందో కూడా మర్చిపోయి ఉంటారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. కేంద్ర సహకారం లేకుండానే సింగరేణి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర వనరులతోనే ప్రారంభం చేసుకుంటామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా సింగరేణి, టీఎస్ ఎండీసీ తెలంగాణ ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతుందని మంత్రి హోదాలో కేటీఆర్ మాట్లాడిన విషయం వాస్తవం కాదా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్షలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పిన విషయం మరిచిపోయారా? తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్లాంట్ ఏర్పాటు చేసి 15 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేటీఆర్ వాగ్దానం ఎక్కడికి పోయిందో చెప్పాల్సి ఉందన్నారు.
కేటీఆర్ బిడ్ లో పాల్గొనవచ్చు
"స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కేటీఆర్ లేఖలో చేసిన ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేకుండా తమకు అలవాటైన ఆరోపణలు చేస్తూ.. తెలుగు సెంటిమెంట్ పేరుతో ఏపీలోనూ అడుగు పెట్టాలన్న ఓ రాజకీయ కుట్రతో విషం చిమ్మే ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు అనేది కేంద్రం స్పష్టంగా చెప్పింది. ప్రైవేటీకరణ అంటే అక్కడి నుంచి ఫ్యాక్టరీని తరలించేస్తున్నట్లుగా ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నట్లుగా భ్రమలు కల్పించి రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీ రాజకీయ పార్టీలు చేతకానివన్నట్లుగా తామే పెద్ద రాజకీయ పోటుగాళ్లమన్నట్లుగా షో చేసుకుంటూ కేటీఆర్ లేఖ రాశారు. కేటీఆర్ లేఖను బట్టి చూస్తే.. అదే అర్థం అవుతుంది. అక్కడి కార్మిక సంఘాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందట.. ఇప్పటిదాకా వారికి అక్కడ పార్టీలేమీ అండగా లేవా ? స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ మిత్రులకు ఇస్తున్నట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నియమ నిబంధనల ప్రకారం ఉంటే కేటీఆర్ కూడా బిడ్ లో పాల్గొనవచ్చు. ఎవరు కాదన్నారు. కేటీఆర్ , కవిత , కేసీఆర్ నయా అంబానీలైపోయారని తెలంగాణ సమాజం కోడై కూస్తోంది." - విష్ణువర్ధన్ రెడ్డి
కాళేశ్వరంలో అవినీతి పంట
దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇచ్చేంత స్థాయికి బీఆర్ఎస్ ఎదిగిందని చెప్పుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. నిజంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని అనుకుంటే కేటీఆర్ ఈ బిడ్‌లో పాల్గొంటే అసలు నిజం తెలుస్తుందన్నారు. కనీసం తన బినామీలతో అయినా ప్రయత్నిస్తే.. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు.. ఎంత మేర జరుగుతుందన్నది తెలుస్తుందన్నారు. అలా కూడా కాదంటే తెలంగాణ ప్రభుత్వమే బిడ్‌లో పాల్గొనవచ్చని సూచించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో చేసుకోబోయే ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేవని చెప్పడం కంటే అమాయకత్వం ఏమీ ఉండదన్నారు. ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఉన్న విషయాలు కేటీఆర్‌కు అర్థం కాకపోతే ఇంకెవరికీ అర్థం కావా ? నిందలేయడానికి అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టడానికి తెలుగు సెంటిమెంట్‌ను ఉద్యమం పేరుతో ఎంత తిట్టినా ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ కురిపిస్తే అక్కడి ప్రజలు ఓట్లేస్తారని ఏపీ ప్రజల్ని ఓ మాదిరిగా కూడా చూడని కేటీఆర్ రాజకీయ అమాయకత్వానికి ఈ లేఖ నిదర్శనంగా కనిపిస్తోందన్నారు.
నీళ్లు , నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణను ఎంతగా దోచుకున్నారో అక్కడి ప్రజలకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోందన్నారు. కాళేశ్వరం పేరుతో నీళ్లతోనే లక్షల కోట్ల అవినీతి పంట పండించుకున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో చేస్తున్న భూదందా గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారన్నారు. నియామకాల పేరుతో పేపర్లు లీక్ చేసి యువత భవిష్యత్‌తో ఆడుకున్న వైనం కళ్ల ముందే ఉందన్నారు. తెలంగాణ ప్రజలే వచ్చే ఎన్నికల్లో మీ పాలన తరిమికొట్టడానికి సిద్ధపడుతూంటే... విశాఖ ఉక్కు - తెలుగు ప్రజల హక్కు అంటూ వస్తే ఇక్కడా అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి? అన్నట్లుగా బీఆర్ఎస్ ఎక్కడ అడుగుపెట్టినా జరిగేది అదే అన్నారు. అవినీతి అక్రమాలు బయటపడే సమయానికి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకున్నంత ఈజీ కాదు ప్రైవేటీకరణ చేస్తున్నారని అవాస్తవాలు ప్రచారం చేసి ఓట్లు కొట్టేయడం అన్నారు.