Visakha News : వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ఏయూ వీసీ, రిజిస్ట్రార్ ప్రచారం- ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సీపీఎం ఆందోళన!
Visakha News : విశాఖలోని ఓ హోటల్ లో ఏయూ వీసీ, రిజిస్ట్రార్ వైసీపీ నేతలు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. వైసీపీ అభ్యర్థికి సపోర్టు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటుచేశారని సీపీఎం, సీఐటీయూ ఆరోపిస్తున్నాయి.
Visakha News : విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యంతో వైసీపీ నేతల సమావేశం అయ్యారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ వైసీపీ నేతలతో హోటల్‍లో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని బలపర్చాలంటూ ప్రచారం చేయాలని వైసీపీ నేతలు కోరారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని హోటల్ వద్ద సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. సీపీఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కారులను అరెస్ట్ చేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్ ఆదివారం నాడు పోలీస్ పహారాలో దసపల్లా హోటల్ లో వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కి మద్దతుగా సమావేశం ఏర్పాటుచేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఏయూ వీసీ, రిజిస్ట్రార్ సమావేశం నిర్వహించారు. బాధ్యత గల పదవుల్లో ఉండి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు ఏర్పాటు చేయడం సరికాదని సీఐటీయూ నేతలు ఆరోపించారు. ఎన్నికల కోడ్ ను ధిక్కరించడమేనని విమర్శించారు. వీసీ, రిజిస్ట్రార్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది.
వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలి
సమావేశం గురించి తెలుసుకున్న ప్రజాసంఘాల నాయకులు, జిల్లా ఆర్‌డీఓ, డీఆర్‌ఓలకు సమాచారం అందించామని సీఐటీయూ తెలిపింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వస్తామని తెలిపడంతో అక్కడకు చేరుకున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, జిల్లా నాయకులు సుబ్బారావు, చంద్రశేఖర్, విద్యా్ర్థి, యువజన సంఘం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపించారు. అధికార పదవులో ఉండి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌లకు పోలీసులు రక్షణగా ఉండటం అధికార దుర్వినియోగమే అవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటికే వైసీపీ తన సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను, ఆర్‌పీలను వినియోగిస్తున్నా ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదని సీఐటీయూ మండిపడింది. వీరందర్నీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయూ వీసీ, రిజిస్ట్రార్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని కోరింది.
వైసీపీ ఎమ్మెల్యేలతో వైవీ సుబ్బారెడ్డి సమావేశం
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలపై ఉమ్మడి ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం, బూడి ముత్యాల నాయుడు పాల్గొ్న్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ను గెలిపించాలని పార్టీ నాయకులకు వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఈ ఇరవై రోజులు పార్టీ నాయకులు నియోజక వర్గాల్లో ఓటర్లను కలిసి మెజార్టీ సాధించే దిశలో పనిచేయాలన్నారు. ఇవాళ్టి నుంచి విశాఖలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల కోసం వైయస్సార్ సీపీ ప్రత్యేక కార్యాలయం పనిచేస్తోందన్నారు.