YS Jagan On Fire: తిరుమల వివాదంపై ప్రధాని మోదీకి, సీజేఐకి లేఖలు - చంద్రబాబుకు అక్షింతలు వేపిస్తా: వైఎస్ జగన్
Tirumala Laddu Row | తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీకి, సీజేఐకి లేఖలు రాస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. నీచరాజకీయాలకుగానూ చంద్రబాబుకు అక్షింతలు వేపిస్తా అన్నారు.
YSRCP Chief YS Jagan Mohan Reddy Press Meet | ఎలాంటి తప్పిదాలు జరగకున్నా తిరుపతి లడ్డూ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లడ్డూ సహా ఇతర ప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగించారని.. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల నెయ్యి వాడి తిరుమలను కల్తీతో అపవిత్రం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలకు రెక్కలు కట్టి దుష్ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందన్నారు.
‘జాతీయ మీడియా తెలిసి చేస్తున్నారో, తెలియకుండా చేస్తున్నారో కానీ వారి చర్యలు బాధ కలిగించాయి. వెంకటేశ్వరస్వామి వ్యవస్థను రోడ్డు మీదకు తెచ్చే పనులు చేస్తున్నారు. ఏపీ పరువును, వెంకటేశ్వరస్వామి పరువును బజారుకీడ్చే ప్రయత్నం జరుగుతుంది కనుక ఇంగ్లీష్ లో మాట్లాడి నేషనల్ మీడియాకు నిజాలు తెలిసేలా చేస్తాను. తిరుమల ఆలయంపై జరుగుతున్న దుష్ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోదీకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాస్తాను. చంద్రబాబు తన రాజకీయ యావ కోసం, దురుద్దేశంతో తిరుమల ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి లేఖ రాస్తాను. దీనిపై నిజానిజాలు తెలుసేలా ఎంక్వైరీ చేపించడం ద్వారా చంద్రబాబుకు అక్షింతలు పడేలా చేస్తాను’ అన్నారు వైఎస్ జగన్.
Also Read: Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ నేతలు సైతం తీవ్ర విమర్శలు చేయడంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. బీజేపీ నేతలకు సగం తెలుసు.. సగం తెలియదంటూ మండిపడ్డారు. తిరుపతి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అంశంపై తాడేపల్లిలో జగన్ మీడియాతో మాట్లాడారు . ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు జాతీయ మీడియాపై, బీజేపీ నేతలపై సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డులో బీజేపీ నేతలు కూడా ఉన్నారని, కాషాయ పార్టీ సీనియర్ నేతలు సిఫారసు చేసిన వారిని టీటీడీ బోర్డులో నియమించినట్లు వారికి తెలియదా అంటూ జగన్ అసహనం వ్యక్తం చేశారు. తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలని, ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ బీజేపీ నేతలు నిజంగా హిందువులకు ప్రతినిధులు అనుకుంటే తిరుమలపై వివాదం చేస్తూ దుష్ప్రచారానికి దిగిన సీఎం చంద్రబాబుపై అక్షింతలు వేయాలని సూచించారు. ఏపీ పరువును, తిరుమల వెంకటేశ్వరస్వామి పరువును తీయాలని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం ధర్మమేనా అని గట్టిగా ప్రశ్నించాలని కోరారు. జాతీయ స్థాయిలో మీడియాకు, జాతీయ నేతలకు నిజాలు తెలియాలని భావించి ఇంగ్లీష్ లోనూ జగన్ పలు విషయాలను వెల్లడించారు. వైసీపీ హయాంలో టీటీడీకి సంబంధించిన చేసిన అభివృద్ధిని వివరించి, ఈ విషయాలు నిజమా కాదా అని ప్రశ్నించారు.
YSRCP Chief YS Jagan to write letters to PM Narendra Modi and CJI over Tirumala Laddu Issue