అధికార పార్టీ వైసీపీలో పెన్షన్ టెన్షన్- తొలగించే ఉద్దేశం లేకుంటే నోటీసులు ఎందుకని ప్రశ్న?
వైసీపీ నేతలకు పెన్షన్ టెన్షన్ పట్టుకుంది. అనర్హుల పెన్షన్‌లు ఎందుకు నిలుపుదల చేయకూడదు అనే కోణంలో అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఏపీలో పెన్షన్లను తొలగిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఇది అధికారులు నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మాత్రమే అర్హులకు పెన్షన్‌ను అందిస్తామని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా కొందరు నిబంధలకు విరుద్దంగా ఉన్నారని అంటున్నారు. వారికి అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహరం ఇప్పుడు ఏపీలో చర్చనీయాశంగా మారింది. మెదటి దశలో దాదాపుగా లక్ష మందికిపై నోటీసులు అందాయని అంటున్నారు. అనర్హులుగా గుర్తించిన పెన్షన్‌దారులను సచివాలయ అధికారులు పిలిచి నోటీసులు ఇస్తున్నారు. రెండు కాపీలు ఇచ్చి ఒకటి సంతకం చేసి రిటర్న్ తీసుకుంటున్నారు. మరొకటి పెన్షన్‌దారుడికి అందిస్తున్నారు.
ఇవి తీసుకురండి....
నోటీసులు ఇచ్చిన తరువాత సచివాలయ అధికారులు మరి కొన్ని మెలికలు కూడా పెడుతున్నారు. నోటీసులు ఇచ్చినట్లుగా సంతకంతో కూడిన లేఖను లబ్ధిదారుడి నుంచి తీసుకోవటంతోపాటుగా అవసరం అయిన ధృవ పత్రాలను కూడా తీసుకురవాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో లబ్ధిదారుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. తమకు పెన్షన్ రాదేమో అనే అనుమానంతో లబ్ధిదారులు ఆందోళననకు గురవుతున్నారు.
ఇదే సమయంలో అధికారులు అడిగిన ధృవ పత్రాలను తీసుకువస్తే పెన్షన్ ఇస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. బాధితులు మాత్రం అధికారుల మాటలను ఎంత వరకు నమ్మాలో తెలియటం లేదని అంటున్నారు.
మొదలయిన రాజకీయం
పెన్షన్ దారులలకు ఇచ్చే ఆర్థిక సహయాన్ని రద్దు చేస్తున్నారంటూ ప్రచారం మొదలవటంతో రాజకీయం కూడా అందులో దూరిపోయింది. ఈ విషయంలపై ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని మండిపడుతున్నాయి. దశల వారీగా పెన్షన్ పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారుల జాబితాలో కోత విధిస్తుందని ఆరోపిస్తున్నాయి. అనర్హలుగా చిత్రీకరించి పెన్షన్‌లో కొత విధించటంపై అన్ని పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా పెన్షన్‌దారులకు నోటీసులు ఇవ్వటంతో వారు ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ఇలాంటి చర్యలు వలన లబ్ధిదారుల్లో భయాందోళనలను రేకెత్తించేందుకు ప్రభుత్వం పరోక్షంగా అధికారులను వాడుకుంటుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీని పై ఆందోళనకు సిద్ధం అవుతామని పార్టీలు హెచ్చరిస్తున్నాయి.
తలలు పట్టుకుంటున్న వైసీపీ నేతలు.
పెన్షన్ల తొలగింపు వ్యవహరం తెర మీదకు రావటంతో అధికార పార్టీకి చెందిన నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఒకసారి నోటీసులు ఇచ్చిన తరువాత లబ్ధిదారుల్లో అనుమానాలు మొదలవుతాయని, దీని వలన ఇప్పుడు కాకపోతే మరో నెలల్లో అయినా తమ పెన్షన్ కోత పడుతుందనే సందేహం వస్తుందని అంటున్నారు. పెన్షన్ పెంచుకుంటూ పోతున్నామని నూతన సంవత్సరంలో 2750రూపాయలు పెన్షన్ ఇస్తామని గడప,..గడపకు తిరిగి భరోసా కల్పిస్తుంటే... మా వెనుకనే వచ్చే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ తొలగించే ఆలోచన లేనప్పుడు,అసలు నోటీసులు ఇచ్చి లేని సమస్యను తెర మీదకు తీసుకురావటం దేనికి అని అడుగుతున్నారు. దీని వల్ల రాజకీయంగా ఇబ్బందులు గురవుతామని..పెన్షన్ వ్యవహరం చాలా సున్నితమైందని దాన్ని టచ్ చేస్తే తట్టుకోలేమంటున్నారు. గడప...గడపకు వెళ్ళి ఏం సమాధానం చెబుతామని అధికార పక్షానికి చెందిన నేతలు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు.