Vijayawada: పోలీసుల అత్యుత్సాహం, దుర్గమ్మ ఆలయ అర్చకులను పదే పదే అడ్డుకున్న ఖాకీలు !
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శలు వస్తున్నాయి. ఆలయ స్థానాచర్య, ప్రధాన అర్చకులను, సిబ్బంది పోలీసులు పదే పదే అడ్డుకున్నారు.
Kankadurga Temple Priests: విజయవాడలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి వెళ్తున్న అర్చకులను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శలు వస్తున్నాయి. ఆలయ స్థానాచర్య, ప్రధాన అర్చకులను, సిబ్బంది పోలీసులు పదే పదే అడ్డుకున్నారు. డ్యూటీ పాస్ లు చూపించినప్పటికీ విజయవాడ పోలీసులు తమ ఇష్టరీతిన ప్రవర్తిస్తున్నారంటూ అర్చకులు మండిపడుతున్నారు. డ్యూటీ పాస్ లు చూపిస్తే పంపించాలి, కానీ పోలీసులు తమను అన్నిసార్లు అడ్డుకోవడం సరికాదన్నారు.
డ్యూటీ పాస్ లు చూపించినా కూడా పదే పదే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆలయ అర్చకులు అడగగా, పోలీసులు వారి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. విజయవాడలో విజయదశమి సందర్భంగా శరన్నవరాత్రులు జరుగుతున్న వేళ ఇలా ఎందుకు చేస్తున్నారని అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకవచనంతో సంబోధిస్తూ, పోలీసులు తమతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని అర్చకులు వాపోతున్నారు.
ఆలయ ఈవో చెబితేనే తాము తాళాలు వేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పైగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఆలయాన్ని కంట్రోల్ లోకి తీసుకుని, భద్రతా పరమైన చర్యలు పటిష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు మూడో రోజు గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.
డ్యూటీ వద్దంటే చెప్పండి మానేస్తాం..
ఐడీ కార్డు లేకపోవడం కాదండి. ఐడెండిటీ కార్డు చూపించినా, మీ ఈవో వద్దన్నారు అందుకే మిమ్మల్ని ఆపేశామని పోలీసులు చెప్పారంటూ అర్చకులు స్పష్టం చేశారు. డ్యూటీకి రావొద్దంటే చెప్పండి మేం రావడం మానేస్తామని ఓ అర్చకుడు అన్నారు. మమ్మల్ని అన్ని ప్రశ్నిస్తున్నారు, ఆధారాలు, ఐడీలు అడుగుతారు.. కానీ మిమ్మల్ని పోలీసులు అని యూనిఫాం చూసి గౌరవిస్తున్నాం. కానీ మీరు కానిస్టేబుల్, ఎస్ఐ, సీఐ ఎవరు అని హోదా అడగటం లేదు కదా అన్నారు. డ్యూటీకి వెళ్లనివ్వడం లేదని, మేం గట్టిగా అడిగిన తరువాత కూల్ అవ్వండని ఇప్పుడు చెబుతున్నారు. ప్రతి ఒక్కరి మాట మేం వినాల్సి వస్తోంది. మీరు ఆలయం లోపలికి వచ్చినప్పుడు మేం మీలాగే ప్రవర్తించామా అని తమను నిలిపివేసిన పోలీసులను సూటిగా ప్రశ్నించారు. పోలీసులు తమను ఆపినప్పుడు ఏం వివాదం ఉండదని, కానీ మేం మా హక్కులు, డ్యూటీకి ఆటంకం లేకుండా చూడాలని అడిగితే మాత్రం పోలీసులు చాలా మంది మా వద్దకు వచ్చేశారంటూ ఆలయ అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు.
శరన్నవరాత్రులలో మూడవ రోజున అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తోంది. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెబుతారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.
గాయత్రి మంత్రం
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"