Kesineni Nani: రాజకీయం అర్థమైతే పైకి రాలేము - ఎంపీ కేశినేని నాని సంచలనం
Vijayawada MP Kesineni Nani: రాజకీయాలు అర్థమైతే పాలిటిక్స్ కు పనికిరామని, పైకి రాలేమంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vijayawada MP Kesineni Nani: రాజకీయం అర్థం కాకూడదు, అర్ధం అయితే రాజకీయాలకు పనికిరామని, పైకి రాలేమంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంలో లెఫ్ట్, రైట్, సెంటర్ కొట్టుకుంటూ అర్థం కాకుండా వెళ్ళాలి అదే రాజకీయం అన్నారు. మీరు జర్నలిజంలో ఉన్నారు, రాజకీయాలు ఎవరికి అర్థం కాకూడదని, అయితే పైకి ఎదగలేమని మీడియా సమావేశంలో అన్నారు. పాలిటిక్స్ అర్థమై అన్నీ తెరిచిన పుస్తకంలా ఉంటే ప్రయోజనం ఉండదన్నారు.
మాజీ ఎమ్మెల్యే సౌమ్యకు తనకు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సౌమ్యకు, తనకు ఏమైనా ఆస్తి తగాదాలు, సౌమ్య నేను ఏమైనా ఇసుక వ్యాపారాలు, మట్టి వ్యాపారాలు చేస్తున్నామా అని అడిగారు. ఇద్దరం కలిసి ఏ వ్యాపారం చేయడం లేదని, కాంట్రాక్టులు కలిసి చేయడం లేదని, బిజినెస్ గొడవలు కూడా లేవన్నారు. తాను, నేను ఇద్దరం క్లీన్ చిట్ మనుషులమేనని ఎంపీ కేశినేని అన్నారు. క్లారిటీ ఇవ్వాలని మీడియా మరోసారి ప్రశ్నించగా.. మీకు ఎలా అర్థమైతే అలా రాసుకోండి అని వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత..
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో పూర్తి వ్యతిరేకత పెరిగిపోయిందని రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో కేశినేని నాని పేర్కొన్నారు. అందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సామంతుల పరిపాలనలో లేమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని గుర్తుచేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు చేసిన చంద్రబాబుపైనే దాడులకు తెగబడుతున్నారని పుంగనూరు ఘటనపై మండిపడ్డారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి హైదరాబాద్‌లో ఇటువంటి పరిస్థితులే ఉండేవని.. హైదరాబాద్‌లో బస్సు దిగాలంటే భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే వాటిని కంట్రోల్ చేయడంతో పాటు ఆ తర్వాత వచ్చిన నాయకులు కూడా అదే పందాలో వెళ్లడంతో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. పాలకులు ఎవరైనా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటే ఇటువంటి దురాగతాలకు పాల్పడకూడదని తెలిపారు. శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని అన్నారు.