దసరాకు రద్దయిన తెప్పోత్సవం, కచ్చితంగా నిర్వహించేందుకు పునరాలోచన - ఎప్పుడంటే !
ఈ ఎడాది హంస వాహనం ఊరేగింపు లేకపోటం భక్తులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు దసరా ఉత్సవాలు అయ్యాయా అనే సందేహం కూడా భక్తుల్లో ఉంది.
బెజవాడ దుర్గమ్మ సన్నిదిలో జరిగిన దసరా ఉత్సవాల్లో ఈ ఎడాది హంస వాహనం ఊరేగింపు లేకపోటం భక్తులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు దసరా ఉత్సవాలు అయ్యాయా అనే సందేహం కూడా భక్తుల్లో ఉంది. భారీ వర్షాల కారణంగా అనుకోకుండా రద్దు అయిన హంస వాహనం ఊరేగింపు దసరా ఉత్సవాల ముగింపుకు సూచికగా ఉంటుంది. అలాంటిది ఈ సారి అత్యంత కీలకం అయిన హంస వాహనం ఊరేగింపు లేకపోవటం అందరినీ నిరాశకు గురి చేసింది. దీంతో ఆలయ అధికారులు మరోసారి హంస వాహనం ఊరేగింపు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ ఎప్పుడు నిర్వహించే ఛాన్స్..
కార్తీకమాసంలో దుర్గామల్లేశ్వరస్వామివార్ల నదీ విహారం నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దసరా మహోత్సవాల్లో చివరి రోజు జరగాల్సిన తెప్పోత్సవం వర్షం కారణంగా రద్దు కావడంతో కార్తీక మాసోత్సవాల్లో ఈ ఉత్సవం చేయాలని దుర్గమ్మ ఆలయ ఈవో డి.భ్రమరాంబ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆమె స్థానాచార్య, వైదిక కమిటీ సభ్యులను ఆదేశించారు. కృష్ణానది అలలపై హంస వాహనం పై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల నదీ విహారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు అంగరంగ వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది కృష్ణానదిలో నీరు ఎక్కువగా ఉండడంతో విహారం లేకుండా హంస వాహనంపై పూజలు చేయాలని భావించారు. అయితే వర్షం కారణంగా ఊరేగింపు కూడా రద్దు చేశారు.
21సంవత్సరాల తరువాత రద్దయిన తెప్పోత్సవం...
21 సంవత్సరాల తర్వాత తెప్పోత్సవం నిర్వాహణకు బ్రేక్ పడింది. వాతావరణం అనుకూలించకపోవటంతో అధికారులు తప్పని పరిస్దితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో భక్తులు అసంతృప్తికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో భక్తులకు కనువిందు చేసేలా కార్తీక మాస ఉత్సవాల్లో నదీ విహారం చేయడానికి గల అవకాశాలపై అధ్యయనం జరుగుతుంది. ఆలయ ఈవో, వైదిక కమిటీ సభ్యు లు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. కార్తీక పౌర్ణమి, ఏకాదశి ఇలా ఏదైన ముఖ్యమైన రోజు వచ్చేలా చూసి తెప్పోత్సవంలో దుర్గామల్లేశ్వరుల ను నదీ విహరంలో విహరింప చేయాలని భావిస్తున్నారు.
భవానీ దీక్షలు వేదికగా...
ఇంద్రకీలాద్రిపై ప్రతి ఎటా రెండు భారీ ఉత్సవాలు జరుగుతాయి. కలకత్తా, మైసూరుతో పాటుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలు బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో నిర్వహిస్తారు.పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల పాటు అమ్మవారి దర్శనం కోసం రాలేకపోయిన భక్తులు ఈ సారి పెద్ద ఎత్తున తరలివచ్చారు. భవానీలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఇక దసరా తరువాత జరిగే మరో కీలక ఘట్టం భవానీ దీక్షల విమరణ. అయ్యప్ప మాలతో పాటుగా, భవానీ మాల కార్తీకమాసంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
అమ్మవారి పేరు మీద భవానీ మాల దారణ చేసిన భక్తులు 48రోజుల పాటు కఠోరమయిన నిమయాలతో భక్తి శ్రద్దలతో దీక్ష చేసి,మాల విరమణకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. దీంతో ఇంద్రకీలాద్రి అరుణశోభితంగా ఉంటుంది. ఇదే సందర్బంలో కూడ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలను కూడా ఆలయ అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని అనుకూలిస్తే దసరా ఉత్సవాల్లో మిస్ అయిన దుర్గమ్మ తెప్పోత్సవాన్ని కార్తీక మాసంలో భక్తులు కనువిందు చేయనుంది.