దసరా ఉత్సవాల పేరిట చేతివాటం- మాజీ మంత్రిపై టీడీపీ తీవ్ర ఆరోపణలు
మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కనుసన్నల్లోనే అధికారులు, కాంట్రాక్టర్లు,లాబీయింగ్ అయ్యి అధిక మెత్తంలో కార్పొరేషన్ నిధులను నొక్కేసేందుకు కుట్ర చేశారని టీడీపీ ఆరోపించింది.
దసరా ఉత్సవాల్లో బెజవాడ కార్పొరేషన్ అధికారులు చేతి వాటం ప్రదర్శించారంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దసరా ఉత్సవాలకు భారీగా తరలి వచ్చిన భక్తులకు కార్పొరేషన్ తరుపున సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన అదనపు సిబ్బంది వ్యవహరంలో లెక్కలు తప్పాయని టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహరం ఇప్పుడు బెజవాడ కార్పోరేషన్ లో చర్చనీయాంశంగా మారింది...
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో సంవత్సరానికి ఒక్కసారి జరిగే భారీ ఉత్సవం ఇది. దీంతో కార్పొరేషన్ అధికారులు శానిటేషన్, నిర్వాహణ కోసం అదనపు సిబ్బందిని తీసుకుంటారు. కాంట్రాక్ట్ పద్దితిలో సిబ్బందిని విధుల్లోకి తీసుకొని వారికి నిబందనల ప్రకారం చెల్లింపులు చేసే బాద్యతను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. కాంట్రాక్టర్ ఇచ్చిన టెండర్‌ను ఆధారంగా కేటాయింపులు చేస్తారు.
టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సిబ్బందికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా జారుకోవటం ఆనవాయితీగా మారింది. గతంలో ఇదే తరహాలో మోసం జరగటంతో సిబ్బంది వామపక్షలను కలుపుకొని ఆందోళన చేశారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే సమయంలో కూడా సిబ్బంది ఆందోళన చేశారు. అయితే కాంట్రాక్టర్ చేసిన పని కావటంతో తమకు సంబంధం లేదంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు తప్పించుకున్నారు. ఇప్పుడు ఇదే విషయం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ మిలాఖత్...
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రి చుట్టు పారిశుద్ధ్యాన్ని నిర్వహించేందుకు కార్పొరేషన్ అధికారులు 146మందిని విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఇదంతా కాంట్రాక్టర్ టెండర్ ద్వారా పనిని అప్పగించారు. దీంతో పని చేసిన కార్మికులకు దిక్కు లేకుండాపోయింది. ఇక్కడే మరో అవినీతి కూడా ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. టెండర్ లో పేర్కొన్న విధంగా సిబ్బంది నియామకం జరగలేదని, నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టర్ వ్యవహరించారని ఆరోపించారు. కాంట్రాక్ట పద్దతిలో తీసుకున్న సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేదని చెబుతున్నారు.
దసరా నవరాత్రి ఉత్సవాలకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అందించిన సేవల్లో అధికార దుర్వినియోగం జరిగిందని టిడిపి ఫ్లోర్ లీడర్ నెల్లి బండ్ల బాలస్వామి ఆరోపించారు. తప్పుడు సిబ్బంది లెక్కలు చూపిస్తూ అధికారులు బిల్లుల సిద్ధం చేయడం సరికాదన్నారు. అధికారులు తమ సొంత లాభాల కోసం ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. మున్సిపల్ కమిషనర్ ఈ విషయంపై సమీక్ష నిర్వహించి అవినీతికి పాల్పడ్డ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
మాజీ మంత్రిపై టీడీపీ ఆరోపణలు...
స్థానిక ఎమ్మెల్యే,మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కనుసన్నల్లోనే అధికారులు, కాంట్రాక్టర్లు,లాబీయింగ్ అయ్యి అధిక మెత్తంలో కార్పొరేషన్ నిధులను నొక్కేసేందుకు కుట్ర చేశారని టీడీపీ ఆరోపించింది. గతంలో కూడా మంత్రిగా ఉన్న సమయంలో వెలంపల్లి ఇలాంటి పనులను ప్రోత్సహించారని అంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణపై కూడా ఆధిపత్యం చెలాయించి మరి వెలంపల్లి ఇంద్రకీలాద్రి కొండపై జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అధికారం చూపించి ఇష్టానుసారంగా వ్యవహరించారని అంటున్నారు.
కార్పొరేషన్ కు దుర్గగుడి బకాయిలు....
వివిధ రకాల సేవల నిమిత్తం బెజవాడ కార్పొరేషన్‌కు దుర్గగుడి నుంచి బకాయిలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు దుర్గగుడి అధికారులు కార్పొరేషన్‌కు కోటి 50 లక్షలపై కూడా బకాయిలు పడ్డారని లెక్కలు చెబుతున్నాయి. మరి వీటిని దుర్గగుడి నుంచి కార్పొరేషన్ ఖజానాకు ఎందుకు జమ చేయించలేకపోతున్నారని కూడా టీడీపీ ప్రశ్నిస్తోంది..