Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ కృష్ణా జిల్లాలోట్రాఫిక్ ఆంక్షలు- ఈ రూట్స్‌లో అసలు వెళ్లొద్దు
Traffic Restrictions: చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ నెల 12వ తేదీ కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయం అస్మి తెలిపారు.
Traffic Restrictions On Chandrababu Swearing Day: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(AP CM)గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈనెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం (Gannavaram Airport) పక్కనే ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ (Kesarapalli IT Park) సమీపంలో ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు హాజరు కానున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలోని ప్రమాణ స్వీకార ప్రాంగణాన్ని తయారు చేస్తున్నారు. ప్రధాని మోదీ, పలువురు సీఎంలు రానున్న వేళ విజయవాడ సీపీ రామకృష్ణ, ఏలూరు రేంజీ ఐజీ అశోక్‌కుమార్, కృష్ణా ఎస్పీ నయీం అస్మిలతో భద్రతపై చర్చించారు. ప్రధాని సహా ఇతర ప్రముఖుల వాహన శ్రేణి ప్రయాణించే మార్గంలో ట్రయల్ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు డీజీపీ గుప్తా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ట్రాఫిక్ ఆంక్షలు
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని చెప్పారు. పోలీసులకు ప్రజలు, వాహనచోదకులు సహకరించాలని కోరారు. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి 216 జాతీయ రహదారి మీదుగా ఒంగోలు వైపు, అలాగే చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలను ఒంగోలు నుంచి రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం, కృత్తివెన్ను, లోసరి వంతెన, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదుగా విశాఖ వైపు మళ్లించామన్నారు.
హైదరాబాద్ వైపు వెళ్లే వారికి
విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గ్రామన బ్రిడ్జి, దేవపరల్లి, జంగారెడ్డిగూడెం, అశ్వా రావుపేట, ఖమ్మం మీదుగా మళ్లించారు. భీమడోలు, ద్వారకా తిరుమల, కామవరపుకోట, చింతలపూడి నుంచి ఖమ్మం వైపు మళ్లించారు. ఏలూరు బైపాస్ నుంచి జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఏలూరు వై జంక్షన్ నుంచి చింతలపూడి, సత్తు మీదుగా హైదరాబాద్ వెళ్లవచ్చు. హనుమాన్ జంక్షన్ నుంచి వెళ్లేవారు వయా నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లవచ్చు.
హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వారికి
హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చే వాహనాలను నందిగామ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావు పేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్జంక్షన్ నుంచి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలని ఎస్పీ కోరారు. విజయవాడలోని రామవరప్పాడు, నున్న, పాములకాలవ, వెలగలేరు, జి. కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించినట్లు చెప్పారు. విజయవాడ నుంచి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు, తాడిగడప, కంకిపాడు, పామర్రు, గుడివాడ నుంచి భీమవరం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
10 వేల మంది పోలీసులతో బందోబస్తు
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గుంటూరు, ఏలూరు రేంజ్‌లు, విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 10 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని వేదిక వరకూ 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. ఎస్పీజీ బృందం విజయవాడలో స్థానిక పోలీసులతో కలసి భద్రతను సమన్వయం చేసుకుంటున్నారు.