Anganwadi Staff Strike: చలో సీఎంవోకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలు- అర్థరాత్రి అరెస్టులు
Anganwadi Staff fight: చలో సీఎంవోకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు మొత్తం ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు.
Anganwadi Staff Strike: చలో సీఎంవోకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఆందోళన చేస్తున్న సిబ్బందిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. వేకువజాము 3 గంటల టైంలో భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు అంగన్‌వాడీ సిబ్బందిని ఈడ్చిపడేశారు.
ముందుగా ధర్నా చౌక్ వద్ద లైట్లు ఆపేశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు భారీ సంఖ్యలో పోలీసులు వచ్చి అంగన్‌వాడీ సిబ్బందిపై పడ్డారు. బలవంతంగా మహిళలను బస్సులో ఎక్కించారు. దీన్ని ప్రతిఘటించిన వారిని ఈడ్చి పడేశారు. సుమారు 20కి పైగా బస్సులు తీసుకొచ్చి వారిని ఎక్కించి అరెస్టు చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అంగన్‌వాడీలను అరెస్టు చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని వచ్చిన మీడియాపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తున్న వారిపై డీసీపీ విశాల్ గున్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కూడా బస్ ఎక్కించారు. ఈ క్రంలో వారితో వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని కిందికి దించేశారు.
ఫొటోలు, వీడియోలు తీస్తే బాగోదని మీడియా వారికి విశాల్ గున్ని హెచ్చరించారు. ఇవి పేపర్లో రావద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. డీసీపీ ఆదేశాలు ఇవ్వడంతో కింది స్థాయి సిబ్బంది రెచ్చిపోయారు. తమ ప్రతాపాన్ని మీడియాపై కూడా చూపించారు.
చలో సీఎంవోకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు మొత్తం ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లపై నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వారందర్నీ ప్రశ్నించారు. వివిధ జిల్లాల నుంచి విజయవాడ ఎవరూ రాకుండా తనిఖీలు చేపట్టారు.
జిల్లాల్లో, మండలాల్లో అంగన్‌వాడీ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న వారిని నిర్బంధించారు. కొందర్ని ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. మరికొందర్ని అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతాలకు తరలించారు. వైజాగ్‌లో భారీ సంఖ్యలో అంగన్‌వాడీ సిబ్బందిని అరెస్టు చేసి పెదుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారు ఆందోళనకు దిగారు.
ఏపీ వ్యాప్తంగా 40 రోజులకు పైగా అంగన్‌వాడీలు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో కోటి సంతకాలు సేకరించారు ఆ ప్రతులను సీఎం జగన్‌కు అందజేసేందుకు ఇవాళ చలో సీఎంవోకు పిలుపునిచ్చారు. దీన్ని రెండు విడతుల్లో చేపట్టాలని నిర్ణయించారు. మొదట విడతో విజయనగరం, ప్రకాశం, బాపట్ల, విశాఖ, అనకాపల్లి, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల కార్యకర్తలు ఒక విడతలో సీఎంను కలవడానికి ప్రయత్నాలు చేశారు. మిగతా జిల్లాల వారు మంగళవారం విజయవాడ చేరుకునేలా ప్లాన్ చేశారు.