Pawan Kalyan: విజయవాడలో వరద బాధితుల్ని అందుకే కలవలేదు - పవన్ కల్యాణ్ క్లారిటీ
AP News: పవన్ కల్యాణ్ విజయవాడలో వరద బాధితులను కలిసేందుకు రాలేదు. దీంతో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీనిపైన కూడా పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు.
Pawan Kalyan Latest News: విజయవాడను ముంచెత్తిన వరదల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది ఒక ప్రకృతి విపత్తు అని.. కొత్త ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే ఈ విపత్తు రావడం దురదృష్టకరం అని అన్నారు. బుడమేరును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పటి ముప్పు వచ్చిందని అన్నారు. బుడమేరుకు సంబంధించిన నిర్వహణ పనులను గత ప్రభుత్వం చేయలేదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి (సెప్టెంబరు 3) విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అందుకే పర్యటనకు రాలేదు
విజయవాడలో వరద నీటి కారణంగా ఎన్నో ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవలపై, జేసీబీలపై పర్యటిస్తూ బాధితులను కలుస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం క్షేత్ర స్థాయి పరిశీలనకు రాలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీనిపైన కూడా పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. తాను వరద బాధితుల వద్దకు వెళ్తే.. పరిస్థితి మరింత చేయిదాటే పరిస్థితులు ఎదురవుతాయని, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పినట్లు పవన్ కల్యాణ్ వివరించారు. అందుకే తాను పర్యటనను విరమించుకున్నానని అన్నారు.
‘‘ఇది ఒక ప్రకృతి విపత్తు. ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే ఈ విపత్తు దురదృష్టకరం. బుడమేరును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పటి ముప్పు. బుడమేరుకు సంబంధించిన నిర్వహణ పనులను గత ప్రభుత్వం చేయలేదు. అన్ని చోట్ల పడ్డ వానలు మనకు ముంపులా వచ్చాయి. గత ప్రభుత్వం ఔట్ లెట్స్ మీద దృష్టి పెట్టలేకపోయింది. వరద తగ్గగానే ఫ్లడ్ కెనాల్స్ ఎలా ఏర్పాటు చేయాలని చర్చిస్తాం. వరద బాధితుల కోసం 262 ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశాం. 176 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అందరం సహాయ కార్యక్రమాలలో పని చేస్తున్నాం. 72 గంటలుగా నిద్ర కూడా లేకుండా అధికారులు అందరూ పని చేస్తున్నారు.
విపత్తు తలెత్తగానే ప్రభుత్వం సత్వరమే స్పందించి ఎఫెక్టివ్ గా పని చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు, రెస్క్యూ ఆపరేషన్స్ కి నా పర్యటన ఆటంకం కారాదు. ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతుగా రూ.కోటి విరాళం అందిస్తున్నాను. ప్రజలు సహాయం కోసం 112, 1070, 18004250101 ఫోన్ చేయవచ్చు’’ అని పవన్ కల్యాన్ అన్నారు.