కాపులకు జరుగుతున్న అన్యాయంపై నోరు తెరవండి- మంత్రులకు టీడీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో కాపులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలుగు దేశం పార్టీ గళమెత్తింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఓ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నాయి. కాపులను కేంద్రంగా చేసుకొని అన్ని పార్టీలు రాజకీయ వ్యూహాలకు పదును పెడతున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో కాపు వర్గాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని వైఎస్‌ఆర్‌సీపీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
జగన్ సర్కార్‌లో కాపుల పరిస్థితి అంతే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో కాపులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలుగు దేశం పార్టీ గళమెత్తింది. పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విజయవాడలో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులాలను రెచ్చగొట్టి తన అవసరాలకు వాడుకోవటం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు.
జగన్ రెడ్డి పాలనలో కాపులకు జరుగుతున్న అన్యాయంపై కాపు మంత్రులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు అనగాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నాలుగేళ్ళ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగలేదేని అన్నారు. చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్లు తీసుకొస్తే, జగన్ రెడ్డి రద్దు చేసి వారి గొంతు కోశారని కామెంట్ చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా యువతకు అందాల్సిన 45వేల రుణాలను రద్దు చేశారని ఆరోపించారు. కాపుల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు కావు నేస్తం అంటూ కొత్త మోసానికి తెరలేపారని విరుచుకుపడ్డారు. ఏటా 15వేల రూపాయల ఇస్తామంటూ కల్లబొల్లి మాటలనుచెబుతున్నారని అన్నారు.
కాపులకు రూ. 2వేల కోట్లుతో బడ్జెట్ అంటూ ఆర్భాటంగా ప్రకటించుకుని, సొమ్ము మొత్తాన్ని మళ్లించారని అనగాని వ్యాఖ్యానించారు. కాపు నేస్తం పేరుతో హడావుడి చేస్తూ వంచిస్తున్నారని ఆరోపించారు. రైతులను విభజించి కాపులకు రైతు భరోసా అందకుండా చేశారని, ఇది ద్రోహం కాదా అని జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. కాపులకు జరిగిన అన్యాయంపై ఆ సామాజిక వర్గపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదో అర్దం కావటం లేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో వాళ్ల నోళ్లకు తాళాలు వేసుకున్నారా అని నిలదీశారు.
కాపుకుల తెలుగు దేశం అండ
తెలుగు దేశం ప్రభుత్వ హయాంలోనే కాపుల అభివృద్ధి సంక్షేమం జరిగిందన్న విషయాన్ని గుర్తించాలని అనగాని సత్యప్రసాద్ అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు పోరాడుతున్న కాపులకు శాతం రిజర్వేషన్లు కల్పించి భరోసా ఇచ్చిందని గుర్తు చేశారు. 2014 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక సామాజిక వర్గానికి బి.సి. స్టేటస్ కల్పించాలంటే ముందుగా రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుందన్నారు. కాపులకి బి.సి. రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టు తీర్పును తు.చ తప్పకుండా అమలు చేశామని చెప్పారు.
నిర్ణీత గడువుతో 2016 జనవరి 16న బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశామని వివరించారు అనగాని. బీసీ కమిషను నియమించి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూశామన్నారు. కేంద్రం ప్రకటించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను ఆర్ధికంగా వెనుకబడిన కాపులకు కేటాయించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.
కంతేరు ఘటన పై డీజీపీకి లేఖ..
కంతేరు దళితులపై దాడికి పాల్పడిన కళ్లం హరికృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీకి తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. కంతేరు దళితులపై వైసీపీ నాయకుడు కళ్లం హరికృష్ణారెడ్డి దాడి అమానుషమని, శామ్యూల్ అనే దళిత యువకుడిని గాయపరిచారని చెప్పారు. దాడి జరిగి మూడు రోజులు అవుతున్నా నేరస్తులపై పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు.