Andhra Pradesh: ఆప్తులే ఇసుకను దోచుకుతింటున్నారు- వదిలిపెట్టనంటూ జెసి ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
Andhra Pradesh: అనుచరులే ఇసుకను అక్రమంగా తరలించుకోతున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివి చేస్తూ తనకు దూరం కావద్దని హెచ్చరించారు.
JC Prabhakar Reddy: ఏపీలో ఇసుక విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు ఊతమిచ్చేలా అధికార పార్టీకి చెందిన నేత మాట్లాడటం కలకలం రేపుతోంది. టీడీపీ నేతలే ఇసుక దోచుకుంటున్నారన్న ఆరోపణలను సమర్థిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురంజిల్లాలో టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గవిభేదాలు ఇలా ఇసుక రూపంలో బయటకొచ్చాయి.
మీ టిప్పర్లు బయటకి రావు..
తమ పార్టీకి చెందిన నాయకులు, తన అనుచరులే విచ్చలవిడిగా ఇసుక దోచుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒక వీడియోను రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. గడిచిన అయిదేళ్లుగా తనకు అండదండగా నిలిచిన నాయకులు, ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుకను అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాలపై గ్రీన్ ట్రైబ్యునల్, హైకోర్టులు, అధికారుల చుట్టూ తిరిగి నేను అడ్డుపడితే.. ఇప్పుడు అనుచరులే దోపిడీకి పాల్పడతున్నారంటూ వీడియో విడుదల చేయడం అధికార పార్టీ నాయకుల్ని కూడా విస్మయపరుస్తోంది. నియోజకవర్గంలో దాదాపు 2.5 లక్షల మంది ఉంటే, కేవలం 25 మంది మాత్రమే ఇసుక రవాణా చేసి సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడికైనా పోయి తోలుకోండి.. నా నియోజకవర్గంలో తోలితే మీ బండ్లు బయటకు కూడా రావని టిప్పర్ ఓనర్లకు వార్నింగ్ ఇచ్చారు.
"ఇసుక దందాలో నా వాళ్లు 25 మంది ఉన్నారు. అంతా నాకు కావాల్సిన వాళ్లే. నాకు దూరమయ్యే పనులు చేయొద్దు. దయ చేసి ఇసుక తోలడం ఆపండి."
— TDP Digital Media (@TDPDigitalMedia) August 27, 2024
-టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి#JCPrabhakarReddy #Anantapur #Tadipatri #SandMafia pic.twitter.com/Hnl3Ej58WH
మీకు అమ్ముకోవడం చేతకాదు..
`ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరంతా ఎంత నష్టపోయారో నాకు తెలుసు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఆ ఇసుక గురించి వదిలేయండి. నా ఆదేశాలను ఖాతరు చేయకుండా అలాగే ముందుకు పోతే నాకు దూరమైనట్టే.. మీకు అమ్ముకోవడం కూడా చేతకాదు.. నేను మార్గం చూపిస్తా. ఇప్పటికే ఏసీబీ విచారణ జరుగుతోంది. కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడతారు. ఇసుక జోలికి వెళ్లొద్దు. ఐదేళ్లు చాలా నష్టపోయా.. నాకు వదిలేయండని విజ్ఞప్తి చేశారు. ఇంటి నిర్మాణానికి ఇసుక కావాలంటే ధైర్యంగా తీసుకెళ్లండి అభ్యంతరం లేదు. అలా కాకుండా దోచుకునే ప్రయత్నం విరమించుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి హితవు పలికారు. కావాలంటే మున్సిపాలిటీ ద్వారా ఇసుక సరఫరా చేద్దామని చెప్పారు.
ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు
ఉచిత ఇసుక పేరుతో కొత్త పాలసీ తీసుకొచ్చామని చెప్పుకుంటున్నా, ట్రావెలింగ్, సీవరేజీ, లేబర్ ఇతరత్రా ఛార్జీలతో కలిపి తమ హయాంలో కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వర్షాలతో ఇసుక దొరకని పరిస్థితి ఉందని, డంపింగ్ చేసిన ఇసుక కూడా టీడీపీ నాయకులే అమ్ముకుంటున్నారని ఆరోపిస్తోంది.
Also Read: మదనపల్లి మంటల కేసులో మరో ట్విస్ట్- మద్యం పాలసీ గుట్టు రట్టైనట్టు సమాచారం