Janasena Pothina Mahesh: నాకు టికెట్ ఇవ్వాల్సిందే, పవన్ పై పోతిన మహేష్ ఒత్తిడి
AP Elections 2024: జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అసంతృప్తికి గురయ్యారు. తనకు కచ్చితంగా విజయవాడ వెస్ట్ సీట్ కావాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. చివరకు నిరాహార దీక్షకు దిగారు.
Janasena spokesperson pothina mahesh: జనసేన తాజా జాబితాతో మరోసారి నిరసనలు మొదలయ్యాయి. టికెట్ పై ఆశ పెట్టుకున్న నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి బయటపెడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటుకోసం తీవ్రంగా ప్రయత్నించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనతోపాటు కొంతమంది జనసైనికులు కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నారు. అయితే ఈ సీటు పొత్తుల్లో బీజేపీకి జనసేన త్యాగం చేసింది. దీంతో ఇక్కడ పోతినకు షాక్ తగిలినట్టయింది. చివరి నిమిషం వరకు తనదే సీటు అనుకున్న పోతిన అక్కడ ప్రచారం కూడా నిర్వహించారు. పార్టీ కార్యాలయం, కార్యకలాపాలకోసం బాగానే చేతి చమురు వదిలించుకున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఆయనకు గౌరవం ఇచ్చిన పవన్.. సీటు విషయంలో మాత్రం తన మాట నిలబెట్టుకోలేకపోయారు. ఆ సీటు బీజేపీకి త్యాగం చేశారు. దీంతో పోతిన మహేష్ అసంతృప్తికి గురయ్యారు. తనకు కచ్చితంగా విజయవాడ వెస్ట్ సీట్ కావాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. చివరకు నిరాహార దీక్షకు దిగారు.
అన్యాయం చేస్తారా..?
గత ఐదేళ్లుగా పార్టీకోసం కష్టపడి పని చేశానంటున్నారు పోతిన మహేష్. తనతోపాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు కూడా పార్టీకోసం కష్టపడ్డారని, పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశామని, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి తమవల్లే సాధ్యమైందని అన్నారు. జనసేన బలపడటం వల్లే స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని వైసీపీ ఆ నియోజకవర్గం నుంచి వేరే చోటకు పంపించిందని చెప్పారు. జనసేన వల్ల వైసీపీ కూడా భయపడిందని.. అయితే ఇప్పుడు ఆ సీటు బీజేపీకి ఇవ్వడం భావ్యం కాదంటున్నారు పోతిన. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తనకు అణువణువూ తెలుసని అంటున్నారు. జనసేనకు మినహా కూటమిలో ఏ పార్టీకి టికెట్ ఇచ్చినా అక్కడ గెలుపు సాధ్యం కాదని చెబుతున్నారు. వైసీపీతో పోటీ పడలేరని అంటున్నారు. పోతిన మహేష్.
పవన్ పై నమ్మకం ఉంది..
విజయవాడ వెస్ట్ సీట్ విషయంలో తనకు పవన్ కల్యాణ్ పై నమ్మకం ఉందని అంటున్నారు పోతిన మహేష్. రెండో లిస్ట్ లో తన పేరు ఉంటుందని పవన్ చెప్పారని, అందుకే తాను దూకుడుగా పనిచేసుకుంటూ వెళ్తున్నానని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా జనసేన టికెట్ తనకు ఇవ్వాలని కోరుకుంటున్నారని, ఆ సీటు తనకు ఇవ్వడమే న్యాయం అన్నారు పోతిన మహేష్. అయితే ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో ఇప్పుడు పవన్ ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తంగా పవన్ 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, 18 సీట్లకు నిన్న లిస్ట్ ప్రకటించారు. మిగిలినవి అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం సౌత్. ఆయా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. దీంతో మిగతా చోట్ల నేతలు రగిలిపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ స్థానం జనసేనలో చిచ్చు పెట్టేలా ఉంది. పోతిన మహేష్ తో పవన్ సంప్రదింపులకు ప్రయత్నిస్తారా లేదా అనేది వేచి చూడాలి.