CM Chandrababu: సంక్షేమానికి సాటిలేదు, సుపరిపాలనకు పోటీ లేదు, ఇది ఆల్ టైం రికార్డ్- సీఎం చంద్రబాబు
Independence Day 2025 | ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఇండిపెండెన్స్ డే వేడులకు నిర్వహిస్తోంది. సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Andhra Pradesh News | విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న వివిధ బెటాలియన్‌లను సీఎం చంద్రబాబు పరిశీలించారు.
ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఏపీ ప్రజలు..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, ఏపీ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్రోద్యమ నేతలు, అల్లూరి సీతారామారాజు లాంటి వారిని ఈ సందర్భంగా స్మరించుకుందాం. 1947 నుంచి నేటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. తెలుగువారు కలిసి ఉండాలనుకున్నాం. స్వాతంత్య్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాటం చేశాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2014 లో రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
ఏపీ విభజన తరువాత నవ్యాంధ్ర ప్రదేశ్ కు తొలి సీఎంగా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. దేశంలోని టాప్ 3 రాష్ట్రంగా ఏపీని నిలిపాం. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం ఏపీ బ్రాండ్ ను నాశనం చేసింది. 10 లక్షల కోట్ల అప్పుతో ఆర్థిక విధ్వంసం చేసింది. ఆ అయిదేళ్లు రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు. ప్రతి వ్యవస్థను నాశనం చేసింది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఎన్డీయే గెలవాలి, రాష్ట్రం బాగుపడాలని 57 శాతం ఓట్ షేరింగ్ తో 94 శాతం సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. తొలి ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా సుపరిపాలనా అందించాం.
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పండుగ ఏపీలోనే..
ప్రజల మద్దతు, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు పయణించాం. సంక్షేమానికి సాటిలేదు. అభివృద్ధికి అడ్డులేదు. సుపరిపాలనకు పోటీ లేదు. ఇది ఆల్ టైం రికార్డ్. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు వేలకోట్ల నిధులు ఖర్చు చేస్తోంది. ప్రజలకు రెట్టింపు సంక్షేమం అందుతోంది. ఎన్నికల హామీలైన సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. ప్రతి పౌరుడు ప్రతి వర్గానికి అండగా నిలిచాం. ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజే 5 సంతకాలతో హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నాం. దేశంలో ప్రతి నెలా ఒకటో తేదీన అదిపెద్ద సంక్షేమ పండుగ నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి 33 వేల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నాం.
సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నాం..
‘రైతు సంక్షేమానికి పెద్దపీట వేశాం. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నాం. కేంద్రం అందించే ఆర్థిక సాయంతో కలిసి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పాం. ఇందులో తొలి విడతగా ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు ఇటీవల అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.2 వేలు ఇచ్చింది. మహిళకు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాం కల్పిస్తున్నాం. ఉద్యోగాల కోసం చర్యలు చేపట్టాం. ఈ నెలాఖరులోగా మెగా డీఎస్సీ 16 వేల పోస్టులను భర్తీ చేస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకే భోజనం పెడుతున్నాం. చేతి వృత్తులు, ఇతర కుల వృత్తుల కోసం కార్పొరేషన్ ద్వారా నిధులు అందిస్తున్నాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మళ్లీ పెంచుతున్నాం. దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనం రూ.20 వేలకు పెంచాం. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మత్స్యకారులకు వేట విరామం సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందించామని’ సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా మహిళలకు ఉచిత బస్సు, కుంకీ ఏనుగులు శకటాలు
విజయవాడ నగరవాసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వాహనంపై నుంచి స్టేడియంలో ప్రజలకు అభివాదం చేశారు. పరేడ్‌తో పాటు వివిధ శకటాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్, ఏపీ సీఆర్‌డీఏ (ద పీపుల్స్ క్యాపిటల్), దీపం 2, వాట్సాప్ మన మిత్ర రియల్ టైం గవర్నెన్స్, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర, అటవీ శాఖ కుంకీ ఏనుగులు శకటం, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పేటీఎం, మహిళలకు ఉచిత బస్సు ప్రయణాం, ఫైరింజన్ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.






















