PM Modi Hoists National Flag: ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ, సైనికుల ధైర్యసాహసాలకు సెల్యూట్
79th Independence Day video | భారత ప్రధాని నరేంద్ర మోదీ 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

Independence Day 2025 | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం "జన గణ మన" ఆలపించారు. దేశ వ్యాప్తంగా నేడు జెండా పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ రికార్డు స్థాయిలో 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అత్యధిక పర్యాయాలు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన మూడో నేతగా మోదీ నిలిచారు. ఈ జాబితాలో దివంగత ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, "ప్రతి ఏడాది జరుపుకునే ఈ జెండా పండుగ దేశంలో ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేస్తూనే ఉంది. ఎడారుల నుంచి హిమాలయాల వరకు.. సముద్రాల నుంచి ప్రజలు ఉన్న ప్రాంతాల వరకు భారతదేశంలోని ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం ఎగరాలి" అని అన్నారు.
#WATCH | ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. #IndependenceDay
— ANI (@ANI) ఆగస్టు 15, 2025
(వీడియో సోర్స్: DD) pic.twitter.com/UnthwfL72O
వీర సైనికులకు సెల్యూట్..
‘ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం ధైర్యసాహసాలను ప్రదర్శించింది. భారత సైనికులకు ఎర్రకోట నుండి సెల్యూట్ చేసే అవకాశం నాకు లభించింది. మన సైనికులు శత్రువులను వారి ఊహకు మించి దెబ్బకొట్టారు. 1947లో మన దేశం ఎన్నో ఆకాంక్షలు, అవకాశాల కోసం స్వతంత్ర రాజ్యంగా మారింది. దేశం ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. కానీ వాటిని మించిన సవాళ్లు దేశాన్ని వెంటాడుతున్నాయి. మహాత్మ గాంధీ సూత్రాలను అనుసరించి, ఆనాడు రాజ్యాంగ సభ సభ్యులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. భారత రాజ్యాంగం గత 75 సంవత్సరాలుగా ఒక లైట్‌హౌస్‌గా దేశ ప్రజలకు మార్గాన్ని చూపుతోంది" అని ప్రధాన మంత్రి మోదీ అన్నారు.
"ప్రకృతి గత కొంతకాలం నుంచి మనందరినీ పరీక్షిస్తోంది. కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలు, ప్రాంతాలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాయి. కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు, వరదలు లాంటి అనేక ఇతర విపత్తులను ఎదుర్కొంటున్నాం. బాధితులకు మా ప్రగాఢ సానుభూతి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి సహాయక చర్యల్లో నిమగ్నమై వారికి అండగా నిలుస్తున్నాయి.’’
‘ఈ స్వాతంత్ర్య వేడుక 140 కోట్ల ప్రజల సంకల్పాల పండుగ. ఈ స్వాతంత్ర్య దినోత్సవం ఎందరో మహనీయుల త్యాగాల ఫలం. దేశంలోని ప్రతి హృదయం ఎంతో ఉత్సాహంతో కనిపిస్తోంది. దేశం నిరంతరం ఐక్యతా స్ఫూర్తిని కొనసాగిస్తోంది’ అని మోదీ అన్నారు.






















