(Source: ECI/ABP News/ABP Majha)
BJPలో చేరాక ఏపీకి రానున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, డేట్ ఫిక్స్ చేసిన నేతలు
ఇటీవలే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పర్యటనకు డేట్ ఫిక్స్ అయ్యింది.
ఇటీవలే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పర్యటనకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈనెల 12వ తేదీన ఆయన విజయవాడకు రానున్నారు. అదే సమయంలో పలువురు పారిశ్రామికవేత్తలు బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీలో చేరిన తరువాత తొలిసారి...
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజయవాడ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. అందులో భాగంగానే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయన రాకను పురస్కరించుకొని పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించటంతో పాటుగా, పలువురు సీనియర్ మాజీ నేతలను ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వనించే కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆదరణ కూడకట్టుకునేందుకు ప్రయత్నాలు మెదలయ్యాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
వైసీపీ స్టిక్కర్లు ప్రభుత్వం...
బీజేపీ అమలు చేసిన సంక్షేమ పధకాలు తామే అమలు చేసినట్లు ఏపీ సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా స్టిక్కర్లు వేసి ప్రజలను మాయ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆస్పత్రిలో ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు ప్రధాని మోదీ అందించారని, అయితే రూపాయి ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పేరు పెట్టుకుని జగన్ స్టిక్కర్లను వేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఆరు వేలు ప్రధాని మోదీ ఇస్తే.. జగన్ రైతు భరోసా అని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పారు. రేషన్ ఉచితంగా ఇస్తే.. ఇంటింటికీ బియ్యం అని స్టిక్కర్ వేశారని, పేదలకు సొంతిల్లు మోదీ కట్టిస్తే.. జగన్ సొంత స్టిక్కర్లను వేసుకున్నారని అన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను అన్న జగన్... జనాలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ అని జగన్ గొప్పలు చెప్పుకున్నారని, జాబు లేదు, క్యాలెండర్ లేదని మండిపడ్డారు. డాబుగా స్టిక్కర్లను మాత్రం వేస్తున్నారని, ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. ఏ గ్రామానికి, పంచాయతీకి అయినా నిధులు ఇచ్చారా అని ప్రశ్నించారు. కేంద్రం వేలకోట్లు ఇస్తే వాటిని మళ్లించారని, ఇప్పుడు ఎందుకు స్టిక్కర్లను వేస్తున్నారో... మీకు ఏ అర్హత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్టిక్కర్ల ప్రభుత్వం నడుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వనరులను పూర్తిగా దోచేశారని ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఇసుక దోపిడీ వెలుగులోకి తెచ్చామని, అన్ని వనరులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు దోచుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా ద్వారా రాష్ట్ర ఖజానాకు వెళ్లాల్సిన డబ్బు వారి సొంత జేబుల్లోకి ఎంత వెళుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబ పార్టీల వల్ల రాష్ట్రం అన్నివిధాలా దివాళా తీసిందని, రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు అయినా ఎందుకు కట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు.
కేంద్రం ఇచ్చే డబ్బులతో పనులు చేస్తూ... గొప్పగా స్టిక్కర్లను వేసుకోవటం శోచనీయమని, జగన్ ప్రభుత్వం అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. 2024 ఎన్నికలలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
బూత్ కమిటీ సమావేశం...
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంటి అనేక మంది సీనియర్ నాయకులు బీజేపీలోకి రావటం అభినందనీయం అన్నారు. బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 12 వ తేదీన విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వస్తారని తెలిపారు. బూత్ కమిటీ సమావేశాలు ద్వారా బీజేపీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. కుటుంబ, అవినీతి పార్టీ నుంచి ఏపీని కాపాడాలంటే బిజెపినే ప్రత్యామ్నాయ పార్టీగా అవతరిస్తోందని చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపాటు...
రాజకీయ జిమ్మిక్కులు చేయడం కేసీఆర్ కు అలవాటేని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ అన్నారు. సింగరేణి ఎందుకు దివాళా తీస్తుందో మొదటగా కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పది వేల కోట్ల నష్టాల్లో ఎందుకు ఉందో చెప్పాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకోవడంలో కేంద్రం కోట్లాది రూపాయలు ఇచ్చిందని, విశాఖను కాపాడాలనే సంకల్పంతో కేంద్రం ముందుకు వెళ్తుందని వివరించారు. కేసీఆర్ ముందుగా సింగరేణి గురించి ఆలోచించాలన్నారు.